మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 29 డిశెంబరు 2018 (10:51 IST)

ఆడపిల్ల పుట్టిందని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు..

ఆడపిల్ల పుట్టిందని.. భర్త ముఖం చాటేశాడు. రెండో పెళ్లి చేసేసుకున్నాడు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా.. పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదిలేక చివరికి కుమార్తెతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మికుంటకు చెందిన లాస్యకు గజ్జెల శివశంకర్‌తో 2014లో వివాహం జరిగింది. 
 
వివాహం సమయంలో అమ్మాయి తరపు వారు నాలుగు లక్షల కట్నం ఇచ్చుకున్నారు. అయితే పెళ్లయ్యాక, లాస్యకు పాప పుట్టాక శివశంకర్ అసలు స్వరూపం బయటపడింది. అమ్మాయి పుట్టిందని లాస్యను అదనపు కట్నం తెమ్మని వేధించాడు. భర్త శివశంకర్‌తో పాటు అత్తమామలు, ఆడపడుచులు వేధించడం మొదలుపెట్టారు. చివరికి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో  లాస్య పుట్టింటికి వచ్చింది. 
 
అయితే తాను లేని సమయంలో భర్త నాగలక్ష్మి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని గతేడాది జూన్ 6న జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించినా.. ఎలాంటి ఫలితం లేకపోవడంతో.. చివరికి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళనను విరమించింది.