1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (09:01 IST)

క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావం... తెలంగాణాలో వర్ష సూచన

ద్రోణి ప్రభావంతో ఆకాశంలో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడే అవకాశం ఉన్నందున తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో శుక్రవారం కోస్తాంధ్ర, తెలంగాణలో ఒకటి, రెండుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు పేర్కొంది.
 
అలాగే, రాయలసీమలో శుక్రవారం కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నాయి. ఇక్కడ సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల అదనపు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. 
 
కాగా, గురువారం అనంతపురంలో అత్యధికంగా 44, కర్నూలులో 43, తిరుపతిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరులో 42, గన్నవరంలో 41, విజయవాడ, తునిలలో 40, మచిలీపట్నం, కాకినాడలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ, కోస్తాంధ్రలోని అత్యధిక ప్రాంతాల్లో శుక్రవారం వేడిగాలులు వీచే అవకాశాలున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.