మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (14:10 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో విస్తారంగా వర్షాలు

rain
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా అల్పపీడనం ఏర్పడింది. దీంతో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజానికి అక్టోబరు నెలలో కూడా ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోయారు. ఇపుడు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.
 
అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలోకి సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది వాయువ్య దిశగా కదులుతుంది. ఈ నెల 20న అంటే రేపటికి అల్పపీడనంగా బలపడనుంది. ఆ తర్వాత తుఫాను పరివర్తనం చెందే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తుంది. ఫలితంగా రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
ముఖ్యంగా, గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.