మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 4 డిశెంబరు 2017 (16:40 IST)

డిశెంబరు 7న ఉత్తరాంధ్రకు తుఫాన్... రాజమౌళి హెచ్చరిక

ఉత్తరాంధ్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎంవో అదనపు కార్యదర్శి రాజమౌళి, వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు రాజశేఖర్, జవహర్ రెడ్డి హెచ్చరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాలకు తుపాన్ తాకిడి దృష్ట్యా ఆయా జ

ఉత్తరాంధ్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎంవో అదనపు కార్యదర్శి రాజమౌళి, వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు రాజశేఖర్, జవహర్ రెడ్డి హెచ్చరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాలకు తుపాన్ తాకిడి దృష్ట్యా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 7వ తేదీన పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్య తుపాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నందున అన్నిరకాల ముందుజాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. 
 
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో వరి నూర్పిళ్లు, వ్యవసాయ పనులు పూర్తిచేసుకోవాలన్నారు. ఇప్పటికే 70% పంటనూర్పిళ్లు పూర్తయ్యాయంటూ, మిగిలింది కూడా త్వరగా పూర్తిచేయాలన్నారు. తుపాన్ వల్ల పంటనష్టం జరగకుండా ముందే అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు గతంలో మంజూరు చేసిన 7 వేల టార్పాలిన్లకు అదనంగా మరో 15 వేల టార్పాలిన్లు మంజూరు చేశామన్నారు.
 
వ్యవసాయం అనుబంధ రంగాలలో ఈ అర్థ సంవత్సరానికి 24% అభివృద్ధి సాధించినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. రబీలో కూడా మరింత పురోగతి వ్యవసాయంలో సాధించాలని, అనుబంధ రంగాలలో ప్రగతిని కొనసాగించాలని కోరారు. రబీ సీజన్‌కు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పంటరుణాల పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. నరేగా పనులు పూర్తి పారదర్శకంగా జరగాలని, 7రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని, ఇంటర్నల్ ఆడిట్ వెంటనే పూర్తిచేయాలని సూచించారు.
 
నరేగాలో చిన్న పొరబాటు జరిగినా నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యానికిగాను లక్షా 82 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని కాంతిలాల్ దండే తెలిపారు. మిగిలినవి కూడా త్వరగా పూర్తిచేయాలన్నారు. 2016-17మంజూరులో ఇంకా ప్రారంభం కావాల్సిన 17వేల ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.  2018-19 శాంక్షన్ అయిన ఇళ్ళకు లబ్ధిదారుల ఎంపిక వెంటనే పూర్తిచేయాలని,పనులు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. 
 
కత్తెర, శూన్యమాసం దృష్ట్యా పెండింగ్ ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా శ్రద్ద వహించాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్సులో వ్యవసాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్, పంచాయితీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, ఇస్రో రాజశేఖర్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.