శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (15:34 IST)

టాటా చెపుతారో.. కొనసాగుతారో చంద్రబాబే తేల్చుకోవాలి : పురంధేశ్వరి

ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు టీడీపీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టడాన్ని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆగ్రహం తెప్పించాయి.

ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు టీడీపీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టడాన్ని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, తమతో కలిసి నడిచేందుకు బీజేపీకి ఇష్టం లేకుంటే స్పష్టం చేస్తే తమదారి తాము చూసుకుంటామని వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. తాము మిత్రధర్మం పాటించలేదని చంద్రబాబు అనడం సమంజసం కాదని ఆమె అన్నారు. తమతో కలసి ఉంటారో.. ఉండరో.. అనే విషయాన్ని టీడీపీనే తేల్చుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. 
 
బీజేపీతో కలసి ఉండాలని టీడీపీ భావిస్తుంటే… అదే విషయం గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబుతో మాట్లాడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి సొంత పథకాలుగా టీడీపీ ప్రచారం చేసుకుంటుందన్నారు. పంచాయతీలకు కూడా కేంద్రం నుంచి నేరుగా నిధులు అందుతున్నాయని తెలిపారు.
 
ఇంకా పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజీనామాలు చేశాకే టీడీపీలోకి రావాలని పార్టీ నేతలను దివంగత ఎన్టీఆర్ కోరేవారని పురంధేశ్వరి అన్నారు. ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలని… ఇదే విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని ఆమె వివరించారు.