సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (14:49 IST)

స్కిల్ కేసులో సీఐడీ తీరు అనుమానాస్పదంగా ఉంది : పురంధేశ్వరి

purandheswari
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏపీ సీఐడీ పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, శిక్షణలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెల్సిందే. 
 
దీనిపై దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందని ఆమె ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్లలో ఒక్కటైనా అధికారులు సందర్శించారా అని ఆమె ప్రశ్నించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణను, అవసరమైన సౌకర్యాలను స్కిల్‌ కేంద్రాల్లో కల్పించినట్లు తమ పరిశీలనలో తేలిందని పురంధేశ్వరి తెలిపారు. 
 
ఏపీ ప్రభుత్వ పెద్దలు కళ్లున్న కబోదిలు : నారా బ్రాహ్మణి 
 
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును మరోమారు ఆయన కోడలు, నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కళ్ళుండి కూడా నిజాలను చూడలేక పోతున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. కళ్లుండి కూడా ప్రభుత్వ పెద్దలు వాస్తవాలను చూడలేకపోతున్నారని విమర్శించారు. 
 
ప్రభుత్వం, సీఐడీ అధికారులు వ్యక్తం చేసిన, చేస్తున్న సందేహాలు, ఆరోపణలను సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ నివృత్తి చేసేలా ఆదివారం పూర్తి విచారణ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం కళ్లుండి కూడా చూడలేకపోతున్నారన్నారని, వైకాపా నేతలు అసమర్థులన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు మల్టినేషనల్ కంపనీలనూ వైకాపా అపహాస్యం చేస్తుందని ఆమె ఆరోపించారు.