శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 మే 2017 (12:26 IST)

పత్రికారంగంలో కొత్త 'ఉదయం'.. ఓ సంచలనం... ఉద్యోగులతో కలిసే భోజనం..

తెలుగు పత్రికారంగంలో ఒక సంచలనం ‘ఉదయం’ దినపత్రిక. సినీ దర్శకుడిగా ఉంటూనే రాజకీయాలు, సామాజిక అంశాల పట్ల మక్కువ కలిగిన దాసరి నారాయణ రావు 1984 డిసెంబర్‌ 29న ఈ సంచలన పత్రికను ప్రారంభించారు. అప్పటికే పత్రిక

తెలుగు పత్రికారంగంలో ఒక సంచలనం ‘ఉదయం’ దినపత్రిక. సినీ దర్శకుడిగా ఉంటూనే రాజకీయాలు, సామాజిక అంశాల పట్ల మక్కువ కలిగిన దాసరి నారాయణ రావు 1984 డిసెంబర్‌ 29న ఈ సంచలన పత్రికను ప్రారంభించారు. అప్పటికే పత్రికారంగంలో లబ్ధ ప్రతిష్టుడిగా పేరుపొందిన ఏబీకే ప్రసాద్‌ ఈ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. అన్ని వర్గాలు ప్రత్యేకించి బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు గొంతుకగా ఈ పత్రిక నిలిచింది. 
 
అవినీతిపై తిరుగు బావుటా ఎగరేసింది. వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల చేతుల్లో కరదీపికగా నిలిచింది. అయితే పత్రికా నిర్వహణ భారం కావడంతో.. దాసరి చేతుల నుంచి నెల్లూరుకు చెందిన నాటి ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి చేతుల్లోకి వెళ్లి, తదనంతరం మూతపడింది. ఈ పత్రికను తిరిగి తీసుకొచ్చేందుకు దాసరి ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఉదయం మాదిరిగానే చిత్రపరిశ్రమ కోసం తీసుకొచ్చిన మరో సంచలనం శివరంజని, మేఘసందేశం కాగా, రాజకీయాల కోసం బొబ్బిలిపులి పేరుతో వారపత్రికను ఆయన నిర్వహించారు.
 
ఆయన ఉదయం పత్రికకు యజమానిగా ఉన్న సమయంలో ఉద్యోగులతో కలిసే భోజనం చేయడం నాడు సంచలనమైంది. విజయవాడ బందరు రోడ్డులోని ఉదయం దినపత్రిక కార్యాలయంలో ఓ పత్రిక అధిపతిగా చెన్నై నుంచి వచ్చి ఉద్యోగులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం వరకు ఈ సమావేశం జరిగింది. భోజనానికి తనకు ఏసీ గదిలో ప్రత్యేకంగా భోజనం చేస్తారని ఉద్యోగులంతా భావించారు. 
 
కానీ తన ఛాంబర్‌ పక్కనున్న హాలులో భోజనానికి కూర్చున్నారు. తనతోపాటు ఉద్యోగులందరినీ భోజనానికి పిలిపించారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి ఉద్యోగులంతా ఆయనతో కలసి భోజనం చేశారు. అప్పట్లో రాష్ట్రమంతా సంచలనం సృష్టిస్తున్న పత్రికకు అధిపతిగా ఉన్న దాసరి.. ఇలా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగులతో భోజనం పెను సంచలనమైంది. ఆయనతో కలసి భోజనం చేయడంతో ఉద్యోగులు ఆనందానికి అవధులు లేవు. అప్పుడే కాదు ఆయన ఎప్పుడు ఉదయం కార్యాలయానికి వచ్చినా ఉద్యోగులతో కలిసే భోజనం చేసేవారు. ఈ విషయాన్ని ఉదయంలో పనిచేసిన పలువురు ఉద్యోగులు ఇపుడు గుర్తుచేసుకున్నారు.