గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (20:19 IST)

రాయలసీమపై అవగాహన లేకుండా సోము వీర్రాజు విమర్శలు: డిప్యూటీ సీఎం అంజాద్

రాయలసీమపై అవగాహన లేకుండా సోము వీర్రాజు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా తెలిపారు. బద్వేలులో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు కారకులై, విభజన హామీలను నెరవేర్చకుండా, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కారణమైన,  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని అన్నారు.

రాయలసీమ ప్రాంతంపైన ఏమాత్రం అవగాన లేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు కేంద్రం నుంచి  రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన అనేక ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన నిధులను ఇప్పించి, ఆ తర్వాత బీజేపీ నేతలు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.

జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చేటప్పుడు మాత్రమే ఆలోచిస్తారుగానీ, మాట ఇచ్చిన తర్వాత వెనుదిరిగే ప్రసక్తే ఉండదని, ఈ విషయం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా స్పష్టం చేశారు. 
 
అంజాద్ భాషా మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1- బ‌ద్వేల్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా వైయ‌స్సార్ సీపీ నేత‌లు, పార్టీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌చారంలో ముమ్మ‌రంగా పాల్గొంటున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎక్క‌డ‌కు వెళ్లినా ప్ర‌జ‌లు సానుకూలంగా స్పందిస్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 95  శాతం పైగా అమ‌లు చేశారు. కులాలు, మ‌తాలు, ప్రాంతాలు, పార్టీలు చూడ‌కుండా అన్ని సంక్షేమ ఫ‌లాలను  ప్ర‌జ‌లంద‌రికీ స‌మానంగా అందిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్ర‌జ‌లు జగన్ మోహన్ రెడ్డిగారికి మద్దతుగా నిలుస్తున్నారు. 
 
2- సంక్షేమ ప‌థ‌కాలు త‌మ‌కు అందుతున్నాయ‌ని ప్ర‌జ‌లు సంతృప్తికరంగా ఉన్నారు. దానికి అనుగుణంగానే బ‌ద్వేల్ ఉప ఎన్నిక ఫ‌లితాలు కూడా ఉంటాయి. ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ఓట్లు అడిగే నైతిక అర్హ‌త  లేదు. రాష్ట్రం ఈ ప‌రిస్థితికి వ‌చ్చిందంటే ఆ రెండు పార్టీలే కార‌ణం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభ‌జిస్తే, ఆ విభ‌జ‌న‌కు ప్ర‌తిప‌క్ష పార్టీగా ఉన్న బీజేపీ కూడా స‌హ‌క‌రించింది.

రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత... బీజేపీ అధికారంలోకి వ‌స్తే అయిదేళ్లు కాదు, ప‌దేళ్లు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని న‌రేంద్ర మోదీ వెంక‌న్న సాక్షిగా ప్ర‌జ‌లుకు హామీ ఇచ్చారు. అయితే ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన ప్ర‌త్యేక హెదా రాలేదు. ప్యాకేజీ రాలేదు. వెనుక‌బ‌డిన ప్రాంతాలు అయిన రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌కు ఎలాంటి ప్యాకేజీ ఇవ్వ‌లేదు. మ‌రి ఇలాంటి ఈ రెండు పార్టీల‌కు ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే హ‌క్కులేద‌ని చెప్ప‌గ‌లం. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే ఓటు హ‌క్కు అడిగే హ‌క్కు ఉంది.   
 
3- ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన హామీల‌లో భాగంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు అధికారంలోకి రాగానే రెండున్న‌రేళ్ల‌లో 95శాతం హామీలు అమ‌లు చేసిన ప్ర‌భుత్వ‌మ‌ని గ‌ర్వంగా చెప్పుకుంటాం. రైతు భ‌రోసా ద్వారా రైతుల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాలు అమలు చేయ‌డంతో పాటు, రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంద‌ని భావించి వ్యవసాయం, ప్రాజెక్టులపై దృష్టి సారించడంతోపాటు ముఖ్య‌మంత్రి జగన్ అనేక సంక్షేమ ప‌థ‌కాలను అన్నివర్గాల ప్ర‌జ‌ల ఇంటి వద్దకే అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఆర్బీకేల ద్వారా నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు అందిస్తున్నారు. పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌తో పాటు వాలంటీర్ వ్య‌వ‌స్ధ ద్వారా ప్ర‌జ‌ల ముంగిట‌కే చేర్చుతున్న ప్రభుత్వం ఇది. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు 95శాతం అమలు చేశాం కాబ‌ట్టే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే ఓటు హ‌క్కు అడిగే హ‌క్కు ఉంది.
 
4- బీజేపీ నేత సోము వీర్రాజు అస‌త్యాలు, అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నారు. రాయలసీమ స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న‌కు ఎలాంటి అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే కాకుండా, స్థానిక సమస్యలు ఆయనకు అసలు తెలియవు. కానీ,  ప్ర‌భుత్వంపై నింద‌లు వేస్తున్నారు. ఇప్ప‌టికైనా బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు ఆపితే మంచిది. 
 
5- రాష్ట్రానికి జీవనాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సిన బాధ్య‌త కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానిదే. ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు అధికారంలోకి రాగానే పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తూ,  రాష్ట్ర ప్ర‌భుత్వ నిధులను కూడా ఖ‌ర్చు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సుమారు రూ.  2500 కోట్లు బ‌కాయిలు ఇంకా కేంద్రం చెల్లించాల్సి ఉంది. మ‌రి ఈవాస్త‌వాల‌ను కూడా బీజేపీ నేత‌లు మాట్లాడాలి క‌దా?

మ‌రి వాటి గురించి ప్ర‌స్తావించ‌కుండా అవాస్త‌వాలు ఎలా ప్ర‌చారం చేస్తారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారు కానీ, ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్‌గారు చేస్తున్న మేలు గురించి బ‌ద్వేల్ ప్ర‌జ‌లంద‌రికీ  తెలుసు. బ‌ద్వేల్ మున్సిపాల్టీ అభివృద్ధి కోసం రూ.130 కోట్లు కేటాయించ‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఎన్నిక‌ల కోడ్ వల్ల ఆ కార్య‌క్ర‌మాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఎన్నిక‌లు పూర్తి అవ్వ‌గానే ఆ నిధుల‌న్ని బ‌ద్వేల్ అభివృద్ధికి ఖ‌ర్చుచేస్తాం.
 
6- ఈ ప్ర‌భుత్వం ప్రజల పట్ల పూర్తి బాధ్య‌తతో పనిచేస్తుంది. టీడీపీ హ‌యాంలో నిధులు దుర్వినియోగంతో పాటు, ఖ‌ర్చు చేసిన నిధుల‌కు లెక్క‌లు కూడా లేవు. అదే మా ప్ర‌భుత్వం బాధ్య‌తాయుతంగా ప‌ని చేస్తుంది కాబ‌ట్టే.. ప్రతి పైసాకు లెక్క చెప్పే పరిస్థితిలో  మేమున్నాం. 

డీబీటీ విధానం ద్వారా, ఒక్క పైసా అవినీతి లేకుండా, మ‌ధ్య‌వ‌ర్తులు, ద‌ళారులు లేకుండా ప్ర‌తి సంక్షేమ ప‌థకం ప్ర‌జ‌ల‌కు నేరుగా చేరుతోంది. సోము వీర్రాజు గారు ఇప్ప‌టికేనా వాస్త‌వాలు గ్ర‌హిస్తే మంచిది. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఖ‌ర్చు పెట్టిన నిధుల‌కు బీజేపీ స‌మాధానం చెప్ప‌గ‌ల‌దా?. మీ హయాంలో వేల‌కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జ‌రిగింది కాబ‌ట్టే మీరు జవాబు చెప్ప‌లేని పరిస్థితి. 
 
7- దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారు త‌న హ‌యాంలో బ్ర‌హ్మ‌సాగ‌రం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం ఇవ్వ‌డం వ‌ల్లే ఇక్క‌డ రైతుల‌కు సాగు, తాగునీరు అందుతోంది. వైయ‌స్సార్ సీపీ అధికారంలోకి వ‌చ్చాక 14.88 టీఎంసీలు నీటిని నిల్వ ఉంచిన ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారి ప్ర‌భుత్వానిదేనని గ‌ర్వంగా చెప్పుకుంటున్నాం. ఆనాడు వైయ‌స్సార్ గారు 13 టీఎంసీలు నీటిని నిల్వ ఉంచితే , ఆ త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వాలు మాత్రం  2,3 టీఎంసీల క‌న్నా నీటిని నిల్వ ఉంచ‌ని ప‌రిస్థితిని మ‌నం చూశాం.
 
8- బ‌ద్వేలుకు తాగునీటి కోసం రూ.110 కోట్ల‌తో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారు పైప్‌లైన్‌ల‌ను ఏర్పాటు చేశారు. బ‌ద్వేలు ప్ర‌జ‌ల‌కు నీళ్లు వ‌స్తున్నాయంటే అది వైయ‌స్సార్ గారి చ‌ల‌వే. ఈ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక కుందు న‌ది నుంచి వ‌ర్ష‌పునీరు  వృథాగా పోతుంటే అందుకోసం సుమారు రూ.490 కోట్లతో ఎత్తిపోత‌ల పథ‌కం ద్వారా బ్ర‌హ్మ‌సాగ‌రంకు నీటి నిల్వ చేసుకునే ఏర్పాటు చేస్తున్నాం.

ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రిగారు శంకుస్థాప‌న చేయ‌డ‌మే కాకుండా టెండ‌ర్లు కూడా పూర్తి చేయ‌డం జ‌రిగింది. త్వ‌ర‌లోనే ప‌నులు కూడా పూర్త‌వుతాయి. అలాగే బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో 173 చెరువుల‌ను నింపిన ఘ‌న‌త మా ప్ర‌భుత్వానిదే.
 
9- అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు క‌ళ్లుగా భావించి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు పరిపాల‌న సాగిస్తున్నారు. అందుకే మేము ప్ర‌జ‌ల ముందుకు ధైర్యంగా వెళ్లి ఓటు వేయ‌మని అడగగలుతున్నాం. సంక్షేమ ప‌థ‌కాలను ప్ర‌జ‌ల ముందుకు తీసుకువెళ్ల‌డ‌మే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ముందుకు తీసుకువెళుతున్నాం కాబ‌ట్టే ఓటు అడిగే హ‌క్కు మాకు మాత్ర‌మే ఉంది. ప్ర‌జ‌లు కూడా మ‌మ్మ‌ల్ని ఆప్యాయంగా స్వాగ‌తిస్తున్నారు.

ఎన్ని అవాస్త‌వాలు ప్ర‌చారం చేసినా, ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా బ‌ద్వేల్ ఉప ఎన్నికలో విజ‌యం సాధిస్తాం. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ గారు ఎంపీగా పోటీ చేసి ఏవిధంగా అత్య‌ధిక మెజార్టీ సాధించారో, అలాగే బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లోనూ అదే తీర్పును ప్ర‌జలు ఇస్తారు. లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో బద్వేలులో వైయస్ఆర్  కాంగ్రెస్  పార్టీ  విజయం  సాధిస్తుంది.