ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు
రాష్ట్రంలో ఉల్లి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ. 20–25 గా ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు సగానికిపైగా పెరిగి సామాన్యుడి చేత కంటతడి పెట్టిస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు దిగుబడి తగ్గడంతో పాటు వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌లో ఉల్లి కొరత ఏర్పడటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
ఇటీవలి వరకు రూ. 20–25 లకే కేజీ ఉల్లిని విక్రయించిన వ్యాపారులు ఇప్పుడు ఏకంగా రూ. 40–45 కు విక్రయిస్తున్నారు. ఇంకొందరు వ్యాపారులు ఉల్లి నాణ్యతను బట్టి మరింత ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
రాష్ట్రంలోని రైతులు నిల్వ చేసిన పాత ఉల్లికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో కొందరు రైతులు నేరుగా విదేశాలకు ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉన్న పంటలు నాశనమయ్యాయి. అదే సమయంలో నాటువేసిన ఉల్లి చేతికి రావాలంటే మరి కొద్ది నెలల సమయం పడుతుంది.
దీంతో అప్పటి వరకు ఉల్లి కొరత తప్పదని, ధరలు పెరుగుతూనే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలలో కూడా వర్షాకాలం ముగుస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో చేతికొచ్చిన ఉల్లి పంటలు ఎందుకు పనికిరాకుండా పోయాయి.
సాధారణంగా నవంబర్ మొదటి వారంలో కొత్త ఉల్లి మార్కెట్‌లోకి రావడం మొదలవుతుంది. కానీ, వర్షాల కారణంగా ఉల్లి పంటలకు అపార నష్టం వాటిల్లడంతో ఈసారి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. అప్పటివరకు ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతూనే ఉంటాయని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.
కాగా, లాక్‌డౌన్ సమయంలో ఉల్లి ధరలు మరింత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో కేజీ ఉల్లి ధర రూ. 90–100 వరకు చేరిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా ధరలు దిగిరావడంతో సామాన్య జనం ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తర్వాత సుమారు ఐదారు నెలలపాటు ఉల్లి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ధరలు పెరగవని సామాన్యులు ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో ఇప్పుడు ధరలు పెరుగుతుండటంతో వారి ఆశలన్ని అడియాశలు అవుతున్నాయి.