గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 18 అక్టోబరు 2021 (17:41 IST)

కరెంటు పరిస్థితులపై సీఎం జ‌గ‌న్ సమీక్ష

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై అధికారులతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.  ఇంధన శాఖకార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, జెన్‌కో ఎండీ శ్రీధర్‌సహా పలువురు అధికారులు హాజర‌య్యారు. బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపైనా నిశితంగా సమీక్ష చేసిన సీఎం వివ‌రాలు అడిగితెలుసుకున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరంగా కరెంటును సరఫరాచేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుని ఆమేరకు తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
 
మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి 2 ర్యాకులు బొగ్గు అదనంగా వచ్చిందని, రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్‌ ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచామని తెలిపారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సహా కోల్ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పుల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపైకూడా ఆలోచనలు చేయాలన్నారు. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని,  పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌కూడా అందుబాటులోకి వస్తోందని తెలిపారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.