అమరావతిలో రూ.63వేల కోట్లతో అభివృద్ధి పనులు.. నారా లోకేష్
ఏపీ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో 7.5 బిలియన్ డాలర్ల (రూ. 63,000 కోట్లు)తో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నిర్మాణాలు, అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న నారా లోకేశ్.. అన్ని రంగాల్లో అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ రంగంలో 3 బిలియన్ డాలర్లు, ప్రైవేట్ రంగంలో 4.5 బిలియన్ డాలర్లతో రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో వివిధ నిర్మాణాలు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని లోకేష్ ఆదివారం రాత్రి సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.
రాష్ట్రంలోని మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ, మూలపేట ప్రాంతాల్లో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఓడరేవులు రానున్నాయని తెలిపారు. భోగాపురంలో రానున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడ పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
వచ్చే 18 నెలల్లో విమానాశ్రయం పనులు పూర్తవుతాయి. అమరావతిలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని డ్రాప్‌బాక్స్ సహ వ్యవస్థాపకుడు సుజయ్ జస్వా నివాసంలో కొందరు పారిశ్రామికవేత్తలను కలిశానని లోకేష్ చెప్పారు.
అక్టోబర్ 29న లాస్ వెగాస్‌లో జరిగే ఐటీసర్వ్ అలయన్స్ సినర్జీ సదస్సులో మంత్రి పాల్గొని, అక్టోబర్ 31న అమెరికాలోని అట్లాంటాలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.