మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 13 సెప్టెంబరు 2018 (17:23 IST)

చంద్రబాబు మెడకు బాబ్లీ ప్రాజెక్టు ఉచ్చు... 2010 నాటి కేసులో నోటీసులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కె. రోశయ్య ఉన్న సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాబ్లీ ప్రాజెక్టును సందర్శించారు. మహారాష్ట్ర సర్కారు నిబంధనలకు విరుద్ధంగా ఈ డ్యామ్‌ను నిర్మించ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కె. రోశయ్య ఉన్న సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాబ్లీ ప్రాజెక్టును సందర్శించారు. మహారాష్ట్ర సర్కారు నిబంధనలకు విరుద్ధంగా ఈ డ్యామ్‌ను నిర్మించింది. ఈ డ్యామ్ సందర్శనకు 2010, జూలైలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు వెళ్లారు. తొలుత డ్యామ్ సందర్శనకు అనుమతిస్తామని చెప్పిన పోలీసులు, ఆ తర్వాత చంద్రబాబు సహా పలువురు నాయకులను అరెస్ట్ చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 
దీంతో ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై మహారాష్ట్ర పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ ఘటనలో టీడీపీ నేతలతో పాటు 76 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీరిని రోశయ్య సర్కారు ప్రత్యేక విమానాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చారు. 
 
అదేసమయంలో బాబ్లీ డ్యామ్ వద్ద ఆందోళనలు చేసినట్లు పోలీసులు ఈ సందర్భంగా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. 
 
కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని బీజేపీ సర్కారు కొనసాగుతోంది. ఈ సర్కారు ఇపుడు 2010 నాటి కేసును తిరగదోడిందని రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందువల్లే కోర్టు నోటీసులు జారీ చేయవచ్చని భావిస్తున్నారు.