బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2020 (13:49 IST)

విభిన్న విద్యా బోధనా పద్ధతులను అనుసరించాలి: పాఠశాల విద్యా శాఖ

నూతన ఆలోచనా సరళితో వినూత్నంగా ఆలోచిస్తే కోవిడ్-19 లాంటి విపత్తులను కూడా మంచి విద్యావకాశాలుగా మార్చుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. విద్యా ప్రమాణాలను సాధించేందుకు, బోధనభ్యసన ప్రక్రియలను పున:నిర్వచించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ)  ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ప్రత్యామ్నాయ క్యాలెండర్ కార్యశాల నిర్వహిస్తోంది.

కార్యశాలలో పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయ క్యాలెండర్ రూపకల్పనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలను మార్గదర్శనం చేశారు. కోవిడ్-19 నేపథ్యంలో ఉపాధ్యాయులందరూ వ్యక్తిగత అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా అడుగులు వేయాలని, విద్యార్థులలో పూర్తి  సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇది చక్కని అవకాశం అన్నారు.

విద్యార్థులను హైటెక్, లోటెక్, నోటెక్ అనే విభాగాలుగా విభజించుకుని తదనుగుణంగా బోధనా ప్రణాళికను రూపొందించాలని, ఉపాధ్యాయులు ప్రాజెక్టు పద్ధతి, కేస్ స్టడీ లాంటి విభిన్న విద్యాబోధనా పద్ధతులను అనుసరిస్తామ‌ని అన్నారు. ఈ విపత్తు కాలంలో 42 లక్షల మంది విద్యార్థులకు విద్య అనే ఆయుధాన్ని సరైన రీతిన  అందించడానికి పునరంకితులు కావాలని కోరారు.

సాంప్రదాయ పద్ధతులలో కాకుండా వినూత్నంగా విద్యా బోధన సాగించేందుకు అవకాశం ఉండేలా, అందుకు అనుగుణంగా మూల్యాంకనం ఉండాలన్నారు. వాతావరణ మార్పులను, ఆధునిక సమాజంలో ఎదురవుతున్న అవరోధాలను విద్యార్థులకు అవగతం చేయాలన్నారు.

కార్యక్రమంలో సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ‘పాఠశాల ప్రారంభమయ్యాక మొదటి రెండు వారాలు కరోనా కష్టకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పిల్లలకు, వారి ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. ఇందుకోసం వెబినార్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. శనివారాల్లో ‘నో బ్యాగ్ డే’ వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

కార్యక్రమంలో భాగంగా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి దేశంలోనే అత్యున్నతమైన, ఆదర్శవంతమైన ప్రత్యామ్నాయ క్యాలెండర్ రూపొందించే విధానాన్ని పవర్ పాయింట్ ద్వారా ప్రజంటేషన్ చేశారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు ప్రసంగిస్తూ ‘నవంబరు 2 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు పాఠశాలలోని 51 విషయాలను సృజనాత్మకంగా బోధించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లుగా తెలిపారు.

కేంద్రప్రభుత్వం విడుదల చేసిన అన్ లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా,  అభ్యసనా సామర్థ్యాలు ఆధారంగా అకడమిక్ క్యాలెండర్ ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఎస్ఏ డైరెక్టర్ పి.పార్వతి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య, పుస్తక ప్రచురణ విభాగ సంచాలకులు బి.మధుసూదనరావు, కేజీబీవీ రాష్ట్ర  కార్యదర్శి ప్రసన్నకుమార్, పాఠశాల విద్య సర్వీసస్ డైరెక్టర్ దేవానందరెడ్డి, గుంటూరు ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి, ఎస్సీఈఆర్టీ ఆచార్యులు, అధ్యాపకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.