సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 అక్టోబరు 2020 (13:44 IST)

దివ్యను పాశవికంగా హత్య చేసాడు, 13 కత్తిపోట్లున్నాయి, అతడిని ఎన్‌కౌంటర్ చేయాలి

తమ కుమార్తె దివ్య తేజస్వినిని బలితీసుకున్న నాగేంద్రను ఎన్ కౌంటర్ చేయాలని ఆమె తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. దివ్యను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచాడనీ, ఆమె శరీరంపై 13 చోట్ల కత్తిపోట్లు వున్నాయని చెప్పారు. అతడి వల్ల తమ కుమార్తె ఎంత మానసిక క్షోభను అనుభవించిందో ఆమె రికార్డ్ చేసిన వీడియోను చూసే దాకా తమకు తెలియలేదని అన్నారు.
 
మరోవైపు విజయవాడలో సంచలనం సృష్టించిన దివ్య తేజస్విని హత్యకు సంబంధించి నిందితుడు నాగేంద్ర బాబు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దివ్య తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నామనీ, గత 13 ఏళ్లుగా ఇద్దరం పరస్పరం స్నేహంగా వుండేవారమనీ, అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసినట్లు చెప్పాడు.
 
దివ్యను పెళ్లాడుతానంటూ ఆమె తల్లిదండ్రులకు తెలుపగా వారు అభ్యంతరం చెప్పారనీ, దానితో తామిద్దరి ఇష్టప్రకారం మంగళగిరిలోని ఓ దేవాలయంలో దివ్య మెడలో మంగళసూత్రం కట్టినట్లు చెప్పాడు. ఇది తెలిసిన తర్వాత తనను దివ్యను వేరు చేసారనీ, తన భార్యను కాపురానికి తీసుకెళతానని ఎన్నిమార్లు చెప్పినా వారు ఒప్పుకోలేదన్నాడు. దీనితో దివ్య సలహా మేరకు ఆమె ఇచ్చిన కత్తితోనే ఆమెను పొడిచి చంపాననీ, ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డట్లు చెప్పాడు.
 
అయితే అసలు నాగేంద్ర బాబు ఎవరో తమకు తెలియదని దివ్య తల్లిదండ్రులు చెపుతున్నారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్నాడంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా దివ్యను హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష వేయాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దిశ ప్రత్యేక అధికారి కృతికా శుక్లా శుక్రవారం బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.