'గో టూ హెల్... స్టుపిడ్' .. నాగేంద్రపై విరుచుకుపడిన తేజస్విని

divyatejeswini - nagendra
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 16 అక్టోబరు 2020 (20:03 IST)
ఏపీలోని విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. దివ్య - నాగేంద్రల మధ్య జరిగిన ఆడియో టేపు సంభాషణలు వెలుగు చూశాయి. ఇందులో నాగేంద్రంపై దివ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడింది. ముఖ్యంగా.. స్టుపిడ్ అంటూ విరుచుకుపడింది. గో టూ హెల్ అంటూ కేకలు వేసింది. ఇకపై తనకు ఫోన్ చేయొద్దంటూ ప్రాధేయపడింది. ఇంత చేసినా నాగేంద్ర మాత్రం తన తీరు మార్చుకోలేదు. ఇంకా తిట్టూ అంటూ అవహేళన చేశాడు.

ఈ హత్య కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన వంకాయలపాటి జోసఫ్‌ అనే వ్యక్తి ఓ ప్రైవేటు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు దివ్య తేజస్విని (21) అనే కుమార్తె ఉండగా, ఈమె వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది.

కరోనా లాక్డౌన్ కారణంగా ఇంటికి వచ్చేసింది. ఆమె ఇంటికి సమీపానే ఉంటున్న బుడిగ నాగేంద్ర అలియాస్‌ చిన్నస్వామి అనే యువకుడు పెయింటింగ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. తేజస్వినితో నాగేంద్రకు కొన్నాళ్లుగా పరిచయం ఉంది. ఆ చొరవతో ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని తేజస్విని తండ్రి జోస్‌ఫను పలుమార్లు అడిగాడు. దీనికి ఆయన తిరస్కరించాడు.

అయినప్పటికీ నాగేంద్ర ఆమెకు ప్రేమ ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నాడు. నాగేంద్రకు, జోస్‌ఫకు మధ్య ఈ విషయమై తీవ్రమైన స్థాయిలోనే ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం జోసఫ్‌ అతని ఇంటికి వెళ్లి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. మరునాడు ఉదయం అంటే గురువారం జోసఫ్‌ ఇంటికి నాగేంద్ర ఆవేశంగా వెళ్లాడు.

నేరుగా తేజస్విని గదిలోకి చొరబడి, అక్కడ కంటికి కనిపించిన కత్తితో తేజస్విని గొంతుపై లోతుగా గాయం చేశాడు. ఆ తర్వాత తానూ గొంతు కోసుకుని, కడుపులో పొడుచుకున్నాడు. అరుపులు విని అక్కడకొచ్చిన కుటుంబసభ్యులు తేజస్వినిని ఆస్పత్రికి తరలిస్తుండగానే.. ఆమె మరణించారు. కడుపులో పొడుచుకోవడం వల్ల తీవ్రంగా గాయపడిన నాగేంద్ర... ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరోవైపు, నాగేంద్ర పక్కన తాళితో తేజస్విని ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రెండునెలల క్రితం మంగళగిరిలో తేజస్విని, తాను పెళ్లి చేసుకొన్నట్టు జీజీహెచ్‌లో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నాగేంద్ర చెప్పినట్టు సమాచారం.

దీనిపై మరింత చదవండి :