శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (22:06 IST)

ఉర్దూ అభివృద్ధికి కృషి చేస్తున్నా వివక్షే

ఉర్దూ భాష అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నా ఉద్యోగుల పట్ల వివక్ష చూపటం తగదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు.

విజయవాడలో బుధవారం ధర్నా చౌక్ వద్ద గత మూడు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఉర్దూ అకాడమీ ఉద్యోగులు దీక్ష ముగింపు సందర్భంగా పాల్గొని ప్రసంగించారు. గత 30 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు లేకుండా పని చేసే వారి పట్ల ప్రభుత్వం ఎందుకు కనికరం చూపించలేదని ప్రశ్నించారు. 

పెంచిన జీతం వారికి ఇవ్వడానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలనుంచి పెద్ద ఎత్తున తమ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని వచ్చిన ఉర్దూ అకాడమీ వెల్ఫేర్ సభ్యులకు జనసేన పార్టీ తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం కొరకు ప్రభుత్వ చొరవ చూపకపోతే జనసేన కూడా ప్రత్యక్షంగా ఆందోళన చేయవలసి వస్తుందన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు లేవు అని చెప్పే ఉర్దూ అకాడమీ చైర్మన్ జీతం నిమిత్తం 10 లక్షలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు.

కేవలం ఉర్దూ అకాడమీని ఉర్దూ భాష అభివృద్ధికి కాకుండా సొంత జేబులు నింపు కుంటున్న తమ పార్టీ వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఉర్దూ అకాడమీలో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

మరో ముఖ్య అతిథి టిడిపి మైనార్టీ లీడర్ ఫాత ఉల్లా మాట్లాడుతూ.. తన పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏం చేస్తున్నారు తెలుసుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి గత మూడు రోజుల నుంచి మాకు జీతాలు లేవు పరిస్థితి బాగోలేదు అంటూ నిరసన దీక్షలు చేస్తున్న వారి బాధలు దృష్టికి రాలేదని ప్రశ్నించారు.

ఉర్దూ అకాడమీ చైర్మన్  నౌ మాన్ పెంచిన జీతాలను తగ్గించాలని అధికారులకు ఉచిత సలహాలు ఇవ్వటం, వారి జీతాలు రాకుండా చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే చైర్మన్ ఛాంబర్ ముందు ఆమరణ దీక్షకు సిద్ధమన్నారు.

ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు ఉమర్ మహమ్మద్ ప్రధాన కార్యదర్శి సాధిక్ లు మాట్లాడుతూ.. మూడు రోజుల నుంచి తాము పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ దీక్షలు చేసినట్లుగా తెలిపారు. ముగింపు రోజు పెద్ద ఎత్తున మైనార్టీ నేతలు, వివిధ పార్టీల కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు, ముస్లిం సంఘాలు ఉర్దూ అకాడమీ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

మైనారిటీ హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఫారుక్ షూబ్లీ తదితరులు వెంటనే ప్రభుత్వం చొరవ చూపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.