శనివారం, 23 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 ఆగస్టు 2025 (21:56 IST)

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

NTR Dist collector
బుడమేరు వరద అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలను నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వీడియో ద్వారా తెలియజేశారు. వెలగలేరు రెగ్యులేటరీ గేట్లు ఇంకా తెరవలేదనీ, అక్కడకు వచ్చిన నీరు నేరుగా కృష్ణా నదిలోకి వెళ్తోందని చెప్పారు. ప్రస్తుతానికి విజయవాడ నగరంలో వున్న నీరు వర్షపు నీరు మాత్రమేనని స్పష్టం చేసారు. ఒకవేళ భారీ వరద వచ్చి గేట్లు తెరవాల్సి వస్తే ప్రజలను అప్రమత్తం చేస్తామనీ, 24 గంటల ముందే హెచ్చరికలు చేస్తామని తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత గేట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి లేదన్నారు. ఏదేమైనప్పటికీ కృష్ణానది, బుడమేరు పరివాహిక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసారు.
 
మరోవైపు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శాఖధిపతులు, సిబ్బందితో వరద అప్రమత్తతపై టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో వ‌చ్చే రెండుమూడు రోజుల పాటు ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ హెచ్చ‌రిక‌ల‌తో పాటు ఎగువ నుంచి ప్ర‌కాశం బ్యారేజీకి వ‌ర‌ద పోటెత్తి క్రమేణా 4-5 ల‌క్ష‌ల క్యూసెక్కుల‌కు కూడా చేరుకునే అవ‌కాశం ఉన్నందున‌, ముందు జాగ్ర‌త్త‌గా న‌దీ ప‌రిస‌ర ప్రాంత గ్రామాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌న్నారు.
 
న‌దివైపు వెళ్ల‌కుండా హెచ్చరిక‌ల బోర్డులు కూడా ఏర్పాటు చేయాల‌ని, కృష్ణానది, బుడమేరు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ఫ్లడ్ అలర్ట్ జారీ చేయాలని, అధికారులు నూతన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పునరావస కేంద్రాల్లోకి తరలించాలని, ఫ్లడ్ అలర్ట్ టీంలు అప్రమత్తంగా ఉంటూ  లోతట్టు ప్రాంతాలలో వరద నీరు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఫ్లడ్ అలర్ట్ ప్రకటించి వారిని పునరావస కేంద్రానికి తరలించాలని, అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల సమస్యలను తెలిపేందుకు కంట్రోల్ రూమ్‌ను 24/7 అందుబాటులో ఉంచాలని కమిషనర్ అన్నారు.