శుక్రవారం, 3 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 13 ఆగస్టు 2025 (15:47 IST)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

Flood water at prakasam barrage
కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి మంగళవారం నాడు 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయడంతో ఈ నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. బ్యారేజి వద్ద 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చే అవకాశం వుందనీ, కనుక కృష్ణా పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రజలు ఎంతో అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.
 
మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నిన్నటి నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ నీరు కూడా కృష్ణా నదిలోకి వస్తున్నాయి. మొత్తమ్మీద బ్యారేజీ వద్ద 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే ప్రమాదం వుందనీ, నది వద్దకు ఎవ్వరూ వెళ్లవద్దనీ, కృష్ణా పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా వుండాలని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు.
 
ఇదిలావుంటే... గత ఏడాది విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తింది. ఈ నేపధ్యంలో వెలగేరు రెగ్యులేటర్ వద్ద బుడమేర వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు గాను ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వచ్చే రెండుమూడు రోజుల పాటు అతిభారీ వర్షం కురవనున్న నేపధ్యంలో సంబంధిత సిబ్బంది అప్రమత్తంగా వుండాలని సూచించారు.