బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 27 నవంబరు 2024 (19:03 IST)

ఆపరేషన్‌ బుడమేరు: విజయవాడను వరద ముంపు నుంచి తప్పించే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది, ఆక్రమణల మాటేంటి?

budameru river
‘‘ఆపరేషన్‌ బుడమేరు చాలా ఖరీదైన వ్యవహారం, దాదాపు ఐదారు వేల కోట్ల రూపాయల ఖర్చయ్యే ప్రాజెక్టుగా అనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ నిధులసమీకరణ మా ముందున్న సవాల్‌. అందుకే డిజాస్టర్‌ మేనేజ్‌‌మెంట్ నుంచి ఏదైనా రాబట్టుకోగలమా అని సీఎం చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారు. నిధుల సమీకరణ సాధ్యమైనంత త్వరగా చేసి.. వచ్చే సీజన్‌కల్లా..ఆపరేషన్‌ బుడమేరుకు రూపురేఖలు తెస్తాం.’’ ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్‌ బుడమేరుపై చేసిన వ్యాఖ్యలివి. మంత్రి మాటలతో బుడమేరుపై కార్యాచరణలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి..
 
ఆపరేషన్‌ బుడమేరు ఎందుకంటే..
ఈ ఏడాది సెప్టెంబర్‌ 1న విజయవాడ నగరాన్ని బుడమేరు వరద సగం మేరకు అనూహ్యంగా ముంచెత్తిన నేపథ్యంలో త్వరలోనే ’ఆపరేషన్‌ బుడమేరు’ చేపట్టనున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. మైలవరం కొండల్లో పుట్టి విజయవాడ మీదుగా కొల్లేరులో కలిసే బుడమేరు దాదాపు 92 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. వరదల సమయంలో తప్పించి మిగతా రోజుల్లో చాలా చోట్ల చిన్నపాటి మురుగు కాలువలానే కనిపించే బుడమేరు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురైంది. దీంతో వరదలు వచ్చినప్పుడు ఎగువ నుంచి భారీగా వచ్చే నీరు సాఫీగా సాగిపోయే మార్గం లేక బుడమేరు విరుచుకుపడుతోంది. ఆ క్రమంలోనే సెప్టెంబర్‌ తొలినాళ్లలో భారీ వర్షాలు వచ్చినప్పుడు బుడమేరు ఒక్కసారిగా పొంగి బెజవాడను ముంచెత్తింది. దాదాపు మూడు లక్షలమంది ప్రజల జీవనంపై ప్రభావం చూపడంతో బుడమేరు ఉపద్రవంపై అందరి దృష్టి పడింది. భవిష్యత్‌లో బుడమేరు ముంపు నుంచి బెజవాడను తప్పించడమే లక్ష్యంగా ఆపరేషన్‌ బుడమేరును త్వరలోనే ప్రారంభిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అలాగే బుడమేరు ఆక్రమణలపైనా దృష్టి సారిస్తామని తెలిపింది.
 
బుడమేరులో 580 ఎకరాల్లో ఆక్రమణలు
బుడమేరులో ఆక్రమణలు జరిగిన ప్రాంతాల్లో ఆరువేల కుటుంబాలు నివసిస్తున్నాయి. విజయవాడ నగరం, విజయవాడ రూరల్‌ పరిధిలో వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి గొల్లపూడి మీదుగా విద్యాధరపురం, గుణదల, రామవరప్పాడు, ప్రసాదంపాడు ఎనికేపాడు వరకు బుడమేరు ప్రవహిస్తోంది. విజయవాడ నగరం, రూరల్‌ పరిధిలోనే దాదాపు 18 కిలోమీటర్ల మేర బుడమేరు ప్రవహిస్తోంది. ఏ కొండూరు నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో సుమారు 2930 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తుండగా దాదాపు 580 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్టు రెండు నెలల కిందట అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత సర్వే ల్యాండ్‌ రికార్డ్స్, ఇరిగేషన్, వీఎంసీ., సిటీ ప్లానింగ్‌ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. సర్వే నంబర్ల వారీగా ఆక్రమణల వివరాలు నమోదు చేశాక మొత్తంగా ఆరు వేల కుటుంబాలు బుడమేరు ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్నట్టు నీటి పారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు బీబీసీకి తెలిపారు.
 
మళ్లీ ఆక్రమణలు మొదలు
బుడమేరు ఛానల్‌ అంతా దాదాపుగా విజయవాడలో ఇళ్ల మధ్య నుంచే ప్రవహిస్తోంది. నగరంలోని ఏలూరు కాలువ, బుడమేరు మధ్య ఒక గట్టు ఉమ్మడిగా ఉంటుంది. ఆ ఉమ్మడి గట్టుపైన రెండు వేల కట్టడాలకు పైగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గట్టుపైనే కాకుండా గట్టు వెంబడి బుడమేరు కుంచించుకుపోయేలా నిర్మాణాలు వెలిశాయి. దీంతో 50 నుంచి 120 మీటర్లు ఉండాల్సిన బుడమేరు వెడల్పు చాలాచోట్ల 10 నుంచి 30 మీటర్లకు కుంచించుకుపోయింది. రియల్‌ వ్యాపారులు బుడమేరును పూడ్చేసి ఏకంగా కాంక్రీట్‌ స్లాబులతో బిల్డింగ్‌లు కట్టేశారు. అయోధ్యానగర్, రామలింగేశ్వర నగర్, నందమూరి నగర్, గుణదల తదితర ప్రాంతాలలో బుడమేరులోనే వందల ఇళ్లు, పదుల సంఖ్యలో కాలనీలు వెలిశాయి. బుడమేరు ఉగ్రరూపం దాల్చితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ వాగు సమీపకాలనీల ప్రజతో పాటు ఆయా ఆక్రమిత స్థలాల్లోని నివాసితులకు సెప్టెంబరులో వరదలు ప్రత్యక్షంగా చూపించాయి.
 
బుడమేరు వరదలకు బెజవాడ మునగడానికి ప్రధాన కారణం ఆక్రమణలే. అంతటి విపత్తు నుంచి బయటపడినా కొందరి తీరు మారలేదనడానికి ఈ రెండు నెలల్లో బుడమేరు వెంబడి ఆక్రమణలు పెరుగుతుండటమే నిదర్శనం. గడిచిన రెండు నెలల్లోనే పాత రాజరాజేశ్వరి పేట, అయోధ్య నగర్‌ నుంచి రామకృష్ణాపురం బుడమేరు వంతెన వరకు రేకుల షెడ్లు, దుకాణాలు వంటి వివిధ ఆక్రమణలు వెలిశాయి. ఈ ఆక్రమణల గురించి మంత్రి నిమ్మల రామానాయుడుతో ప్రస్తావించినప్పుడు, ఆక్రమణలను సహించేది లేదని, గత ప్రభుత్వంలో అలాంటి నిర్మాణాల ఫలితంగానే సెప్టెంబర్‌లో అంతటి విపత్తు వచ్చిందని, తమ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కూల్చేస్తుందని స్పష్టం చేశారు.
 
ఇంతకూ ’’ఆపరేషన్‌ బుడమేరు’’ అంటే..
ఆపరేషన్ బుడమేరు కింద ఏం ప్రతిపాదించారంటే..
 
1. వెలగలేరు రెగ్యురేటర్‌ వద్దనున్న బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌(బీడీసీ) సామర్థ్యం 15వేల క్యూసెక్కుల నుంచి 37,500వేల క్యూసెక్కులకు పెంచడం. మొన్న సెప్టెంబర్‌లో మాదిరిగా ఒకేసారి 50వేల క్యూసెక్కుల వరద నీరు వస్తే బుడమేరు ఓల్డ్‌ చానెల్‌ ద్వారా కొంత నీరు పంపించేలా చర్యలు తీసుకోవడం.
 
2. బుడమేరు ఓల్డ్‌ చానెల్‌లో ఆక్రమణల తొలగింపు. వెలగలేరు రెగ్యులేటర్‌ నుంచి విజయవాడ సిటీ దాటి, ఎనికేపాడు యూటీ (అండర్‌ టన్నెల్‌) మీదుగా కొల్లేరు వరకు బుడమేరు ప్రవాహం ఉంది. అయితే ఎక్కడికక్కడ ఆక్రమణల వల్ల వాగు కుంచించుకుపోయింది. బఫర్‌ జోన్‌లో కాకుండా కేవలం జలవనరుల శాఖ పరిధిలోని ఓల్డ్‌ చానెల్‌లోనే మూడు వేల ఇళ్లు(ఆరువేల కుటుంబాలు) ఉన్నట్టు ఆధికారుల సర్వేలో తేలింది. ఈ కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపడం, ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు ఉన్న యూటీల సామర్ధ్యం పెంచడం.
 
3.వెలగలేరు రెగ్యులేటర్‌ నుంచి బుడమేరు ఓల్డ్‌ చానెల్‌కి సమాంతరంగా ఉన్న పాత కాలువను విస్తరిస్తే.. నగరంలోని ఇళ్ల జోలికి వెళ్లనవసరం లేదు. ఇది ఇరిగేషన్‌ స్థలాలు, పొలాల నుంచి వెళుతున్నందున భూసేకరణ సులువవుతుందని ప్రతిపాదించారు.
 
4. బుడమేరు నుంచి కొల్లేరు వరకు పూడిక తీత పనులు చేయాలని ప్రతిపాదించారు.
 
ఈ ప్రతిపాదనలన్నీ అమలు చేయడానికి నాలుగైదు వేల కోట్ల రూపాయల వ్యయమవుతుందని, ఇంతటి భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ఆర్ధిక స్థితి దృష్ట్యా కేంద్ర సాయం కోరాలని భావిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు బీబీసీతో చెప్పారు.
 
ఎప్పుడు ప్రారంభిస్తారు?
ఆపరేషన్‌ బుడమేరును ఎప్పుడు ప్రారంభిస్తారని ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని  ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యుడు మొండితోక అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ అంశాన్ని  లేవనెత్తిన ఆయన ‘‘ఆపరేషన్‌ బుడమేరు’ ప్రారంభించి నెలలో ఆధునీకరిస్తామని సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటించారని గుర్తుచేశారు. దీనిపై జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జవాబిస్తూ.. బుడమేరు ఆక్రమణలతో నిండిపోవడం వల్ల దీనికి సమాంతరంగా పాత చానెల్‌ను అభివృద్ధి చేయాలని చూస్తున్నామని చెప్పారు. అయితే ఇందులో ఆరు వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, టిడ్కో ఇళ్ల మాదిరి నిర్మించి ఆ కుటుంబాలను తరలించే ఆలోచన చేస్తున్నామన్నారు. కార్యాచరణ ఎప్పుడు మొదలు పెడతారు..? ఆపరేషన్‌ బుడమేరు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో ప్రభుత్వం ఆ సమావేశాల్లో స్పష్టత ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ సభ్యుడు అరుణ్‌కుమార్‌ ఆరోపించారు.
 
కట్ట పటిష్టతకు చర్యలు: ఈఎన్‌సీ
బుడమేరులోకి వస్తున్న పట్టిసీమ నీటిని నిలిపిన తర్వాత కట్ట పటిష్టతకు చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు బీబీసీకి తెలిపారు. సెప్టెంబర్‌ వరదలకు కొండపల్లి వద్ద బుడమేరు కట్టకు గండ్లు పడిన చోట పనులను డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. "ప్రస్తుతం కృష్ణా డెల్టాకు నీటి అవసరం ఉండటం వల్ల పట్టిసీమ నుంచి నీరు విడుదల చేశాం. డిసెంబర్‌ చివరలో పట్టిసీమ నీటిని నిలుపు చేసి అప్పటినుంచి కట్ట పటిష్టతకు చర్యలు తీసుకుంటాం. రెండు నెలల కిందట యుద్ధప్రాతిపదికన జరిగిన పనుల్లో కొన్ని చోట్ల నీటి చెమ్మ బయటకు వచ్చింది. వాటన్నిటికీ మరమ్మతులు చేస్తాం.. ఆపరేషన్‌ బుడమేరు ప్రాజెక్టుకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి వచ్చే డబ్బుతో సంబంధం లేకుండా ఈ కట్ట మరమ్మతులు చేపడతాం’’ అని ఆయన వివరించారు.