శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (19:56 IST)

తెలుగు భాషను చంపేయకూడదు: పవన్ కల్యాణ్

మాతృభాషను దూరం చేస్తే మట్టికొట్టుకుపోతారని వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇంగ్లీష్ భాష గ్లోబల్ భాషని అంటూ  దాని పేరుతో తెలుగు భాషను చంపేయకూడదని హితవు పలికారు.

విజయవాడ ఏలూరు రోడ్డులోని విశాలాంధ్ర బుక్ హౌస్‌ను సందర్శించిన జనసేనాని  కార్ల్ మార్క్స్, ఫౌంటెన్ హెడ్ సహా పలు పుస్తకాలు కొనుగోలు చేశారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  మాతృభాషను ఏపీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుందన్నారు.

భాషాప్రయుక్త రాష్ట్రం కావాలనే ఆ నాడు పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారని గుర్తుచేశారు.  ఇతర రాష్ట్రాలు కూడా తమ తమ మాతృభాషలను సంరక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ఇంగ్లీష్ అవసరమే..కానీ తెలుగును చంపకూడదని జనసేనాని అభిప్రాయపడ్డారు.

6 వ శతాబ్దంలో ఏడూ వేల గ్రామాల మండలమైన రేనాడు – ఇప్పటి రాయలసీమలోనే తెలుగు లిపిలో ఉన్న మొట్టమొదటి శాసనాలన్నీ దొరికిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం అప్పటి రేనాడు గ్రామాలే నంటూ  తాజాగా  ఇప్పుడు  రాయలసీమకు చెందిన  ముఖ్యమంత్రే  తెలుగుకి  ద్రోహం చేస్తున్నారంటూ విమర్శించారు.

దీనిపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై అధికార పక్షం నేతలు ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. గతంలో టీడీపీ చేసిన తప్పులనే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తుందని విమర్శించారు.

అప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన జగన్  ఇప్పుడు తన నిర్ణయాన్ని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు.  మాతృభాషను కాపాడుకునే విషయంలో ఇక్కడి నేతలకు పట్టుదల లేదని విమర్శించారు.