బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (22:59 IST)

రెండు వారాల్లో పరిష్కారం రాకుంటే టెంట్లు వేసి నిరసన: పవన్ కళ్యాణ్‌

భవన నిర్మాణ కార్మికుల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి కానీ, వ్యక్తిగతంగా తనను దూషిస్తే సమస్య పరిష్కారం కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేయాల్సిన వ్యక్తులు దిగజారి మాట్లాడితే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు.

ఎవరూ విమర్శ చేయలేని స్థాయిలో ప్రభుత్వం పాలన అందిస్తే తమకు రోడ్ల మీదకు వచ్చే అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం గొప్ప పాలన అందిస్తే మెచ్చుకుంటామని, విధివిధానాల్లో తప్పులు ఉంటే మాత్రం  నిలదీస్తామని అన్నారు. సోమవారం సాయంత్రం విశాఖపట్నం నోవాటెల్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

భవన నిర్మాణ కార్మికుల కోసం తలపెట్టిన లాంగ్ మార్చ్ కు మద్దతు తెలిపిన పార్టీలకు, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన జనసైనికులకు, ఆడపడుచులకు ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..

"వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైన వ్యక్తిగత ద్వేషం లేదు. ప్రజల కష్టాలను గుర్తించమనే కోరుతున్నాను. గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని ఇసుకను నిలిపివేయడంతో నిర్మాణ రంగం కుప్పకూలిపోయింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అధికారికంగా 10 మంది, అనధికారికంగా 50 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. 
 
ఆరు నెలల్లో ఓ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం ఇదే తొలిసారి... 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది శాసనసభ్యుల బలం ఉంటే.. జనసేన పార్టీకి ఒకరు మాత్రమే ఉన్నారు. వారి బలం ముందు మా బలం సరిపోదు. ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీ చేపట్టిన లాంగ్ మార్చ్ లో అంత మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారంటే సమస్య ఉందని అర్థం.

ప్రజల్లో లేని భావోద్వేగాన్ని, కోపాన్ని తీసుకురాలేం. అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపించిన పార్టీకి 6 నెలల్లో ఇంత వ్యతిరేకత రావడం ఇదే తొలిసారి. ఇసుక విధానంలో లోపాలు ఉన్నాయని తెలిసినా దాన్ని సరిదిద్దడం లేదంటే అందులో ఏదో లబ్ది కోసం వెతుకుతున్నారు.

నిజంగా సరిచేయాలి అంటే 15 రోజుల  సమయం సరిపోదా..?. ఇసుక కొరత సమస్య పరిష్కారానికి రెండు వారాలు గడువు ఇచ్చాం. గడువులోగా సమస్యను పరిష్కరించకపోతే జనసేన శ్రేణులు భవన నిర్మాణ కార్మికులకు అండగా టెంట్లు వేసుకొని కూర్చుంటారు.

ఈ రెండు వారాలూ సమస్యను గుర్తు చేసేందుకు నిరసనలు కొనసాగిస్తాం. అయితే అది రేపటి నుంచి మొదలు పెట్టాలా?, ఎల్లుండా అనేది స్పష్టం చేస్తాం. కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదు. 
 
ప్రభుత్వ పాలసీని ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తారా? 
ప్రభుత్వ పాలసీలపై ప్రశ్నిస్తే.. మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. మాట్లాడితే మా అన్నయ్య గారి వల్ల ఎదిగాను అంటున్నారు. అవంతి శ్రీనివాస్ గారు మాత్రం పుట్టగానే గడ్డం పెట్టుకుని తిరుగుతున్నారా?. మా అన్నయ్యగారి వల్ల నేను పది మందికి తెలిసి ఉండవచ్చు.

కానీ నా యాక్టింగ్ ఆయన చేయలేదు. నా ముఖం తీసేసి ఆయన ముఖం పెట్టుకోలేదు. అయితే కృతజ్ఞత ఉండాలి. కన్నబాబు గారు లాంటి వారికి సైతం ఆ కృతజ్ఞతే ఉండాలని అంటున్నాను. అవంతి శ్రీనివాస్ గారు కూడా ఒకప్పుడు నా చుట్టూ తిరిగేవారు. ఎవర్నీ వ్యక్తిగతంగా దూషించడం నాకు ఇష్టం లేదు. దాని వల్ల సమస్య పక్కదోవ పడుతుంది.

అయితే నన్ను దూషించే వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాను.. మీ మాటలకు భయపడే వ్యక్తులం కాదు. ఇసుక పాలసీపై పార్టీ తరఫున సబ్ కమిటీ వేసి సరైన సూచనలు, పరిష్కారాలు వెలికితీస్తాం. రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి ఇసుక సరఫరా ఎలా ఉండాలి, భవన నిర్మాణ కార్మికులకు ఎలా అండగా ఉండాలి అనే అంశాలపై ఓ విధానాన్ని రూపొందించి బయటకు విడుదల చేస్తాం.  
 
ప్రభుత్వ విధానంలో తప్పులకు చీఫ్ సెక్రటరీ బదిలీ నిదర్శనం 
నిర్మాణ కార్మికుల సమస్యపై ప్రభుత్వానికి పదేపదే చెప్పుకుంటూ వచ్చాం. సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం వల్లే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. కార్మికుల సంక్షేమనిధి నుంచి చనిపోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు నష్టపరిహారం, 5 నెలలుగా పనులు లేక పస్తులు ఉన్న ప్రతి కార్మికుడికి రూ. 50 వేలు రూపాయలు ఇవ్వాలి.

ప్రభుత్వ విధానం ఎంత తప్పుగా ఉందో చెప్పడానికి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉదంతమే ఉదాహరణ. కోరి తెచ్చుకున్న ఆయన్ని ఎందుకు బదిలీ చేశారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక మెమో పంపితే ఆయన్ని తీసి ఇంకో వ్యక్తిని పెట్టారంటే అక్కడ అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయన్న విషయం అర్ధం అవుతుంది. ఇది ప్రజలకు సైతం తెలుస్తుంది. 
 
రాజకీయాల కోసం ఎవరి వ్యాపారాలు మానుకున్నారు? 
సినిమాల్లో నటిస్తానో లేదో ఇంకా స్పష్టత లేదు. అయితే ఖచ్చితంగా ప్రొడ్యూస్ మాత్రం చేస్తాను. నాకు తెలిసింది సినిమానే. రాజకీయాల కోసం ఎవరు వ్యాపారాలు మానుకున్నారు. జగన్ రెడ్డికి జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ వారు ఆపుకున్నారా..? లేదా అవంతి కాలేజీలు లాక్కుని నేను ఏమైనా పాలిటిక్స్ చేయాలా? అని అన్నారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... "ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనవసరమైన  నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులుపడుతున్న సందర్భాల్లో క్షేత్ర స్థాయిలో మనం తిరగాలి అని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ ను విశాఖలో విజయవంతంగా నిర్వహించగలిగాం.

కేవలం ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి చేపట్టిన ధర్మపోరాటంలో భాగంగా జనసేన పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడుతుంది అని తెలియచేస్తున్నాం. గడచిన వారం రోజుల నుంచి జనసేన పార్టీ కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రం నలుమూలల భవన నిర్మాణ కార్మికుల వెతల్ని క్షేత్ర స్థాయిలో అందరికీ చేరేందుకు మీడియా కృషి చేసినందుకు ధన్యవాదాలు.

ప్రజా క్షేత్రంలో నెలకొన్న ఇబ్బంది కరమైన పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మీడియా పాత్ర ఎంతో గొప్పది" అన్నారు. ఈ సమావేశంలో జనసేన ముఖ్య నేత వి.వి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.