మెజారిటీ సభ్యులు చేతులెత్తితే... పరిషత్ ఛైర్మన్ అయిపోయినట్లే!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ఉద్రిక్తతల మధ్య జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చివరి అంకం ఇపుడు జరగబోతోంది. అదే జెడ్పీ ఛైర్మన్లు, మండల అధ్యక్షుల ఎన్నిక. దీనికి ప్రభుత్వం విధి విధానాలను జారీ చేసింది.
ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎంపికకు చేతులెత్తే విధానం అమలు చేస్తున్నారు. వివిధ మండలాల్లో మండలాధ్యక్షులు, జిల్లాలలో జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నారు. కలెక్టర్లకు, జెడ్పీ సీఈఓలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ మేరకు లేఖ రాశారు. ఎన్నికలకు విధి విధానాలను తెలియజేశారు.
మొత్తం సభ్యులలో సగం మంది హాజరైతేనే ఎన్నిక ప్రారంభం అవుతుంది. ఏపీలోని 18 రాజకీయ పార్టీలకు విప్ జారీ చేసే అధికారం ప్రభుత్వం కల్పించింది. అయితే, ఆ జాబితాలో జనసేనకు చోటు దక్కలేదు. ఇక, ఈ పరిషత్ ఛైర్మన్ల ఎన్నికలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని మండల పరిషత్తులలో ప్రత్యేక సమావేశం ఏర్పటు చేసి, మండలాధ్యక్షుడిని ఎంపీటీసీ సభ్యులు చేతులు ఎత్తి ఎన్నుకుంటారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం జిల్లా పరిషత్‌లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, జిల్లా పరిషత్ ఛైర్మన్లను ఎన్నుకుంటారు.