గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (10:09 IST)

ప‌రిష‌త్ ఎన్నిక‌లు ఏ ప‌రిస్థితుల్లో జ‌రిగాయో నాకు తెలుసు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాలు తుడిచిపెట్టుకుపోయాయి. 98 శాతం స్థానాల‌ను అధికార వైసీపీ చేజిక్కించుకుంది. దీనిపై ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న వీడియో సందేశాన్ని కూడా రిలీజ్ చేశారు. ప్ర‌తిప‌క్షాల ఉనికిని ప్ర‌శ్నించారు. అయితే, దీనికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కౌంట‌ర్ ఇచ్చారు.
 
పవన్ కళ్యాణ్ త‌మ పార్టీ త‌ర‌ఫున పరిషత్ ఎన్నికల్లో విజేతలకు అభినందనలు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులందరూ బలమైన పోరాటం చేశార‌ని కొనియాడారు. ఇప్పటి వరకు అందిన స‌మాచారం మేర‌కు ప్రకటించిన ఫలితాల‌లో 177 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ స్థానాలను జనసేన అభ్యర్ధులు గెలిచారు. 
 
పార్టీ తరఫున విజయం సాధించిన అభ్యర్ధులందరికీ జనసేన తరఫున, త‌న తరఫున అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అయితే, సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ గా ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందించారు.
 
ఈ ప‌రిష‌త్ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయన్న అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా దగ్గర ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ఫలితాలపై రెండు మూడు రోజుల్లో సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తాను...అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ పేర్కొన్నారు.