గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (12:36 IST)

నోరు చీరేస్తానంటూ ఎంపీడీవోను హెచ్చరించిన నల్లచెరువు వైకాపా నేత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నల్ల చెరువు గ్రామ మాజీ సర్పంచ్ ఎంపీడీవోను పరుష పదజాలంతో గట్టిగా హెచ్చరించారు. నా మాట వినకుంటే నాలుక చీరేస్తానంటూ మందలించాడు. ఈ బెదిరింపులకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ మండలంలో వైకాపా నేతల మధ్య గ్రూపు రాజకీయాలు తారా స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో తమ వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావించిన నల్లచెరువు మాజీ సర్పంచ్ వానంశెట్టి తాజాజీ సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. 
 
కార్యాలయంలోకి అడుగుపెడుతూనే ఎంపీడీవో కేఆర్ విజయపై విరుచుకుపడ్డారు. తమ మాట వినడం లేదని, మాట వినకుంటే చీరేస్తానని హెచ్చరించడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సూపరింటెండెంట్ దీక్షితులు చెబుతున్నా వెనక్కి తగ్గలేదు కదా... అసభ్య పదజాలంతో దూషించారు. 
 
తాను ఇక్కడ పని చేయడం ఇష్టం లేదని, ఎక్కడికైనా పంపించాలని ఎంపీడీవో చెబుతున్నా తాతాజీ మాత్రం వినిపించుకోలేదు. ఆ తర్వాత ఎంపీడీవో నేరుగా వెళ్లి అమలాపురం ఆర్డీవోకు ఫిర్యాదు చేసి, తనకు వైకాపా నేతల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.