శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 మార్చి 2020 (08:22 IST)

పారామిలటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలి: చంద్రబాబు

పారామిలిటరీ బలగాలతో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర పోలీసులు అన్‌ఫిట్‌ అని చంద్రబాబు విమర్శించారు.

ఇప్పుడున్న ఎన్నికల కమిషనర్‌ను తాను నియమించలేదని, అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ రికమెండేషన్‌తో ఎన్నికల కమిషన్‌ నియామకం జరిగిందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదని, టీడీపీ నేతలకు భద్రత కల్పించడం లేదని మండిపడ్డారు. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారని, జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకాళహస్తిలో వైసీపీ ఉన్మాదం ఏంటి?, మంత్రులకు కొమ్ములు వచ్చాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్షాల నుంచి అభ్యర్థులు నిలబడవద్దా? అని చంద్రబాబు అన్నారు. తమ వాళ్లు కొందరు నిస్సహాయ స్థితిలో బాయ్‌కాట్‌ చేశారని, ప్రజాకోర్టులో జగన్‌ను దోషిగా నిలబెడతానని చంద్రబాబు తెలిపారు. వాలంటీర్లు మీ ఇష్టప్రకారం చేస్తారా?, భయపడే సమస్య లేదని, న్యాయం..ధర్మం కోసం పోరాడుతామన్నారు.

ఎన్నికలను రీనోటిఫై చేయాలని, నీవు ఒక్కడివే తెలివైనోడివా, మిగతా రాజకీయపార్టీలు లేవా? అని ప్రశ్నించారు. కావాలని సామాజికవర్గాన్ని తీసుకొని వస్తారని చంద్రబాబు మండిపడ్డారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ పేరుతో రాజధాని రైతులను వేధిస్తున్నారని, అధికారం ఉంది కదా అని పిచ్చికుక్కలా కరుస్తుంటే భరించాలా? అని చంద్రబాబు మండిపడ్డారు.
 
నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవాలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నియమాలు అన్ని పార్టీలకు ఒకేలా ఉంటాయని, పులివెందుల మార్క్‌ రాజకీయం కుదరుదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయకుండా 2130 చోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారని విమర్శించారు.

బెదిరించి 22 శాతం స్థానాలను ఏకగ్రీవం చేసుకుంటారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నికలను మేం గౌరవించాలా?, ప్రజలు ఓటేస్తారన్న ధైర్యం ఉంటే ఎందుకిలా చేస్తారు? అని చంద్రబాబు అన్నారు.

తెనాలిలో ఓ ఇంట్లోకి వెళ్లి మద్యం సీసాలు పెట్టి కేసులు బుక్‌ చేస్తారా?, పోలీసులను అడ్డంపెట్టుకొని అక్రమ కేసులు బనాయిస్తారా? అని ప్రశ్నించారు. మీరు బెదిరిస్తే భయపడడానికి మేం సిద్ధంగా లేమని, వైసీపీ ఓడిపోయే చోట్ల ఎన్నికలు పెట్టడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో ఎన్నికలు వాయిదా వేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
 
ఈసీ కూడా జగన్‌ హిట్‌లిస్టులోకి వచ్చింది
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాపై సీఎం జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని చంద్రబాబు అన్నారు. జగన్ ఎవరు చెప్పినా వినరనడానికి  ఇదే ఉదాహరణ అని చంద్రబాబు విమర్శించారు.  కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని,కరోనా గ్లోబల్ వైరస్‌గా మారింది..147 దేశాలకు పాకిందని చంద్రబాబు అన్నారు.

లక్ష మందికిపైగా కరోనా వైరస్‌బారిన పడ్డారని, కరోనాతో ఇప్పటికే ఐదు వేల మందికి పైగా చనిపోయారని చంద్రబాబు స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను.. డబ్ల్యూహెచ్‌వో మహమ్మారిగా ప్రకటించిందని బాబు అన్నారు. చైనా, ఇటలీలో ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు తప్ప అన్నీ మూసేశారని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను కేంద్రం విపత్తుగా ప్రకటించిందని, నేపాల్‌, భూటాన్‌ నుంచి రాకపోకలు నిలిపివేశారని చంద్రబాబు తెలిపారు.

ఆరు రాష్ట్రాల్లో షట్‌డౌన్ చేశారని, కరోనాపై జగన్‌ ఒక్క రోజు కూడా సమీక్ష చేయలేదన్నారు. 60 ఏళ్ల వాళ్లకే కరోనా వస్తుందని చెబుతారా? అని చంద్రబాబు మండిపడ్డారు. కరోనా వస్తే పారాసిటమాల్‌ వేస్తే తగ్గిపోతుందంటున్నారని, మీ చేతగానితనానికి ఇదే నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేని తనమని చంద్రబాబు విమర్శించారు.

నీ అక్కసు అంతా వెళ్లగక్కుతున్నారని, ప్రజలను ఎడ్యుకేట్‌ చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు సీఎంకు లేదని, సీఎం తమాషా ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా గురించి సీఎంకు కనీస అవగాహన లేదని, ఇది రాష్ట్రం దురదృష్టమన్నారు. ఇతని అహంభావం రాష్ట్రానికి శాపంగా మారిందని, సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కరోనా వైరస్‌ సీఎం సొంత వ్యవహారం కాదని, ఇష్టారాజ్యాంగా మాట్లాడడం సరికాదని చంద్రబాబు అన్నారు. మాట్లాడితే 151 సీట్లు గెలిచామంటారని, ఎవడిచ్చారు మీకు సర్వాధికారమని చంద్రబాబు విమర్శించారు. ఇష్ట ప్రకారం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే అధికారం మీకు లేదన్నారు. ఎన్నికల కమిషన్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుందని, గత ఎన్నికల ముందు అధికారులను..పోలీసులను తప్పించలేదా? లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఈసీని కూడా బెదిరిస్తారా.. ఈసీ కూడా జగన్‌ హిట్‌లిస్టులోకి వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల నియమాలు అన్ని పార్టీలకు ఒకేలా ఉంటాయని, సీఎంకు రాజకీయాలు తప్ప ప్రజారోగ్యం పట్టదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. లండన్‌లో కూడా స్థానిక ఎన్నికలు నిలిపివేశారని చంద్రబాబ వెల్లడించారు.