బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 జూన్ 2024 (08:22 IST)

అమరావతి రైతుల కోరిక నెరవేరింది.. చాలా సంతోషంగా ఉంది : వెంకయ్య నాయుడు

venkaiah naidu
అమరావతి రైతుల కోరిక మేరకు అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, అనేక అడ్డంకులు, ఇబ్బందులు, కష్టనష్టాలు ఎదుర్కొని వేలాది మంది రోజుల పాటు ఉద్యమం కొనసాగించిన అమరావతి రైతుల అభీష్టం నెరవేరిందన్నారు. 
 
ఏపీ సీఎంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. మొదటి నుంచి కూడా తాను  రాష్ట్రానికే ఒకే రాజధాని ఉండాలని ఆకాంక్షించానని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం వంటిదన్నారు. రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే ప్రతి ఒక్కరి కోరిక అని చెప్పారు. 
 
ఏపీ కానివ్వండి, మరే రాష్ట్రమైనా కానివ్వండి. సమగ్రాభివృద్ధి ఎంతో అవసరం అని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం తప్పు కాదని తెలిపారు. కాగా, గత వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధానికి లేకుండా చేయడమే కాకుండా అమరావతిని పూర్తిగా విధ్వంసం చేయాలన్న సంకల్పంతో శ్మశానంగా మార్చివేసిన విషయం తెల్సిందే.