బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (12:46 IST)

మనది ప్రజాస్వామ్యమా? సిగ్గుపడాల్సిన విషయం: విజయేంద్ర ప్రసాద్

vijayendraprasad
దేశ రాజకీయాలపై సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో 40 శాతం మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు నేర చరితులేనని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని ప్రజాస్వామ్యం అందామా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సిగ్గు పడాల్సిన విషయం అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
రాజ్యసభ సభ్యుడైన విజయేంద్ర ప్రసాద్ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 40 శాతం మంది క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.
 
నేర చరిత్ర లేని వాళ్ళకు గెలుపు అవకాశాలు కేవలం 4 శాతం మాత్రమేనని, అదే నేర చరిత్ర ఉన్నవారికి గెలుపు అవకాశాలు 15 శాతంగా ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతుందని ఆయన వెల్లడించారు. దీన్ని మనం ప్రజాస్వామ్యం అని ఎలా అంటామని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం కానేకాదు. సిగ్గుపడాల్సిన విషయం అని విమర్శించారు.
 
రాజ్యాంగంలో మార్పు చేస్తే తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడలేరని విజయేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎవరైనా ఆలోచించాలని, తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్‌తో పాటు లోక్‌సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ కూడా పాల్గొన్నారు.