శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (12:26 IST)

ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కానున్న భద్రాద్రి రాములోడు...?

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నవ్యాంధ్ర సీఎం జగన్‌ల మధ్య స్నేహం ఉంది. దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అనేక సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం గ్రామాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయబోతున్నట్టు సమాచారం. ఇదే విషయంపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు కూడా ప్రారంభమైనట్టు వినికిడి. భద్రాద్రిని ఏపీలో కలిపే ప్రతిపాదనపై కేంద్ర సర్కార్ సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో భేటీ అయినప్పుడు విభజన సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంగా భద్రాచలం విలీనాంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అటు భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు తెలంగాణ సీఎం సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఇదే జరిగితే భద్రాచలం రాములోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోనున్నాడు. 
 
ఇదిలావుంటే భద్రాద్రిని ఆంధ్రప్రదేశ్‌లో కలపాలంటే పెద్ద తతంగమే జరగాల్సివుంది. రాష్ట్ర సరిహద్దులు మార్చాలంటే అసెంబ్లీ, పార్లమెంట్‌లో చట్ట సవరణ జరగాలి. ఆ తర్వాత రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేయాలి. అయితే ఇరు ప్రభుత్వాలు సుముఖంగా ఉంటే ఇది కష్టమేమి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
కాగా ఒకప్పుడు ఏడు మండలాలను ఏపీలో కలపడంపై అప్పట్లో తెలంగాణ ఉద్యమ సంఘాలు, తెరాస పార్టీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరి ఇప్పుడు భద్రాద్రి గ్రామాన్ని కూడా ఏపీలో కలిపితే ప్రజలు నుంచి ఆందోళనలు తలెత్తే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా సున్నితమైన ఈ అంశాన్ని పరిష్కరించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కసరత్తు చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.