బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (16:40 IST)

ఏపీ పాఠశాలల్లో ఇకపై "నో బ్యాగ్ డే" ... ప్రతి రోజూ అరగంట 'ఆనంద వేదిక'

నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తన మార్క్ పాలను చూపిస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఆయన ప్రభుత్వ పాలనపై దృష్టిసారించారు. అలాగే, జూన్ ఒకటో తేదీ నుంచి ఆయన ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సమక్షలకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా తొలుత ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. 
 
అలాగే, విద్యాశాఖ ప్రక్షాళనకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. పాఠశాల విద్యలో నూతన విధానాన్ని అమలు చేయనున్నారు. ఇక నుంచి పాఠశాలల్లో ప్రతి రెండు, నాలుగు శనివారాల్లో 'నో బ్యాగ్ డే' నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో నో బ్యాగ్ డే నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. 
 
నో బ్యాగ్ డే అంటే.. వారంలో ఒక రోజు పూర్తిగా ఆటపాటలకే విద్యార్థులను పరిమితం చేయడం.. ఇలా చేయడం వల్ల విద్యార్థులను ఉత్సాహపరిస్తే, మిగిలిన వారమంతా చదువులపై దృష్టిసారిస్తూ ఎంతో ఉత్సాహంగా ఉంటారన్నది ప్రభుత్వ భావనగా ఉంది. దీంతోపాటు ప్రతిరోజు అరగంట ఆనంద వేదిక తరగతులు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
 
పాఠశాల విద్యార్థులకు రోజువారీ పాఠాల బోధన, పుస్తకాల మోతలకు భిన్నంగా ఆట, పాటలతో వారిలో పాఠశాలంటే భయం పోగొట్టడం పాఠశాలలో వారిని ఆనందంగా ఉంచేందుకు దీన్ని తీసుకొస్తున్నారు. ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతోపాటు ఆనందవేదిక తరగతులను ప్రవేశపెట్టనున్నారు. ప్రతిరోజు ఉదయం అర్థగంటపాటు ఈ తరగతులు నిర్వహిస్తారు. ఏ నిర్ణయం తీసుకున్న విద్యార్థులు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచనలు చేసినట్టు సమాచారం.