శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (11:05 IST)

వణికిస్తున్న 'గజ' తుఫాను .. కడలూరులో విద్యుత్ సరఫరా నిలిపివేత

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్‌ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఈ విలయం నుంచి ఇంకా తేరుకోక ముందే ఇప్పుడు గజ తుఫాన్‌ తీరంవైపు దూసుకొస్తోంది. గజ ఘీంకారంతో తీరప్రాంత ప్రజలను వణుకుపుట్టిస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో తూర్పు అగ్నేయంగా చెన్నై - నాగపట్నం మధ్యలో కేంద్రీకృతమైన గజ తుఫాన్‌… గురువారం రాత్రికి తీరందాటనుంది. 
 
తూర్పు మధ్య, దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని గజ తుఫాన్‌ కొనసాగుతోంది. ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పయనించి, మంగళవారం రాత్రి చెన్నైకి తూర్పు ఈశాన్య దిశగా 600, నాగపట్నానికి ఈశాన్యంగా 720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాన్‌.. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ బుధవారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా బలపడింది. అనంతరం అదే దిశలో పయనిస్తూ తుఫానుగా బలహీనపడి గురువారం రాత్రికి తమిళనాడులోని పంబన్ - కడలూరు మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
తుఫాన్‌ ప్రభావంతో ఈ సాయంత్రం నుంచి దక్షిణ కోస్తాంధ్రలోనూ, 15వ తేదీన దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ కొన్నిచోట్ల మోస్తరుగానూ, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. 
 
ఇక తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 70-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని… సముద్రంలో అలలు 2.5-5 మీటర్ల ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను నేపథ్యంలో మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. 
 
మరోవైపు గజ తుఫాన్‌ దూసుకొస్తుండడంతో ఏపీ ప్రభుత్వంతో పాటు తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీలైనంత ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.