శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (10:31 IST)

తమిళ మందు బాబులు రూ.602 కోట్ల మద్యం తాగేశారు...

దీపావళి పండుగను పురస్కరించుకుని తమిళనాడులో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి. కేవలం నాలుగు రోజుల్లో ఏకంగా 602 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని మద్యం బాబులు తాగేశారు. గత యేడాది విక్రయాలతో పోల్చుకుంటే ఇది 34 శాతం అధికం కావడం గమనార్హం. అలాగే, చెన్నై మహానగరంలో నాలుగు రోజుల్లో ఏకంగా రూ.175 కోట్లకు మద్యం విక్రయాలు జరిగాయి. గత యేడాదితో పోల్చితే ఇది 20 శాతం అధికం. 
 
సాధారణంగా పండుగ సీజన్‌లలో మద్యం విక్రయాలు జోరుగానే సాగుతుంటాయి. ఆ విధంగా ఈ యేడాది మద్యం విక్రయాలకు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అన్ని మద్యం దుకాణాల్లో భారీగా మద్యం నిల్వలు ఉంచారు. 
 
ఈ నేపథ్యంలో దీపావళి పండుగ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.602 కోట్లకు విక్రయాలు జరిగాయి. ఒక్క చెన్నై నగరంలో జరిగిన విక్రయాలను పరిశీలిస్తే, గత శనివారం రోజున రూ.124 కోట్లకు విక్రయాలు జరిగాయి. అలాగే, గత ఆదివారం రూ.150 కోట్లు, సోమవారం రూ.148 కోట్లు, దీపావళి పండుగ రోజున రూ.180 కోట్లకు చొప్పున మద్యం విక్రయాలు జరిగాయి. 
 
నిజానికి ఈ దీపావళికి టపాకాయల విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే, ఇతర వస్తు సామాగ్రి విక్రయాలు కూడా గణనీయంగా తగ్గాయి. కానీ, మద్యం విక్రయాలు మాత్రం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 35 శాతం మేరకు పెరగడం గమనార్హం.