బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (22:06 IST)

విజ‌య‌వాడ పోలీసు వ‌ర్గాల్లో ఆందోళ‌న

క‌రోనా వైర‌స్ రోజురోజుకు తీవ్ర‌త‌ర‌మ‌వుతోన్న ‌క్ర‌మంలో లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డంలో నిత్యం రోడ్ల‌పై విధుల్లో ఉంటున్న పోలీసుల‌కు క‌రోనా వైర‌స్ ఆందోళ‌న క‌ల్గిస్తుంది. విజ‌య‌వాడ న‌గ‌ర ప‌రిధిలో ఓ పోలీస్‌స్టేష‌న్‌లో ప‌ని చేసే ఎస్సైకి కరోనా పాజిటీవ్ కావ‌డంతో వారు మ‌రింత ఆందోళ‌‌న  చెందుతున్నారు.

హైద‌రాబాద్ నుండి వచ్చిన స‌ద‌రు ఎస్సైకి  వైద్య పరీక్షలు నిర్వ‌హించ‌గా కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు. ఆ ఎస్సైతో పాటు మరో ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు న‌గ‌రంలోని ఒకే గ‌దిలో అద్దె ఇంట్లో ఉంటున్నారు.

పాజిటివ్ వచ్చిన ఎస్సైను చికిత్స నిమిత్తం ఐసోలేష‌న్‌కు ‌తరలించిన అధికారులు అత‌నితో పాటు ఉండే మిగ‌తావారిని క్వారంటైన్‌కు తరలించారు. వారితో ఎవ‌రెవ‌రు కలిసి పనిచేశారు, వీరు  ఎవ‌రెవ‌రిని క‌లిశారు అనే అంశాల‌పై ఆరా తీస్తున్నారు.
 
విజ‌య‌వాడ‌లో హాట్‌స్పాట్ ప్రాంతాలివే
విజ‌య‌వాడ విద్యాధరపురంలోని కుమ్మరిపాలెం, పాత రాజ‌రాజేశ్వ‌రిపేట, రాణిగారితోట, కుద్దుస్‌నగర్, పాయకాపురం, కానూరు పంచాయతీ పరిధిలోని సనత్‌నగర్ ప్రాంతాలతో పాటు కొత్తగా కార్మికనగర్, కృష్ణలంక ప్రాంతాలను కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాలుగా ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్.
 
మంగళగిరిలో ర్యాపిడ్ కిట్లతో టెస్టులు
మంగళగిరి పట్టణములో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో కోవిడ్- 19 నిర్ధారణ పరీక్షలు  నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం ముందు వరుసలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ పరీక్షలు నిర్వహించారు.

పట్టణ సీఐ శ్రీనివాసులు రెడ్డి, పట్టణ ఎస్సై లు, సిబ్బంది టెస్టులు చేయించుకున్నారు. అలానే ఆశా వర్కర్లకు, వాలంటీర్ లకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా టెస్టులు నిర్వహిస్తున్న నూతక్కి మెడికల్ అధికారి డాక్టర్  వెంకట రావు మాట్లాడుతూ మంగళగిరి అర్బన్ కు 350 టెస్టు కిట్లు అందజేసినట్లు చెప్పారు.

ప్రస్తుతం ముందువరుసలో ఉన్న సిబ్బంది అయిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, వాలంటీర్లకు ఈ టెస్టులను చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలిరోజు మంగళగిరి లోని రెడ్ జోన్ లో విధులు నిర్వహిస్తున్న శానిటరీ సిబ్బంది,పోలీస్ సిబ్బందికి టెస్టులు నిర్వహించామని అన్నారు. ఈ టెస్టు కిట్లద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.