అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు త్యాగం చేశారు.. నిర్మలా సీతారామన్
అమరావతి నిర్మాణానికి రైతులు భూములిచ్చి పెద్ద త్యాగం చేశారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు.
ఐదేళ్ల తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడం ఒక యజ్ఞం వంటిదన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదన్నారు ఒకే చోట ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదు అని చెప్పారు. భవిష్యత్‌లో రాజధాని నిర్మాణమంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు.
'అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి. రాజధాని నిర్మాణానికి భూములిచ్చి రైతులు పెద్ద త్యాగం చేశారు. అలాంటి వారికి సమస్యలు రాకుండా సేవలందించడం బ్యాంకుల ప్రథమ బాధ్యత. రైతుల పంట రవాణాకు ప్రత్యేక రైళ్లు వెళ్తున్నాయి. మహారాష్ట్ర నుంచి అరటికాయలు, తమిళనాడు నుంచి కొబ్బరి రవాణా అవుతున్నాయి.
కూరగాయలు, పండ్లకు ఏపీని హబ్‌గా చేసి, ఉత్పత్తుల రవాణాకు సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అందుకు బ్యాంకులు సహకరించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటు ఇవ్వాలి. అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న సీఎం చంద్రబాబును చూసి అంతా గర్వపడాలి. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా' అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.