శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (14:14 IST)

మూడుతరాలను కబళించిన డెంగీ భూతం.. ఎక్కడ?

డెంగీ భూతం. ఇపుడు దేశవ్యాప్తంగా భయభ్రాంతులకు గురిచేస్తున్న జ్వరం. ఈ జ్వరంబారినపడితే ప్రాణాలు కోల్పోవాల్సిందేనన్న భావన ప్రజల్లో నెలకొంది. ఈ కేసులు కూడా ఆ విధంగానే నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఓ కుటుంబం డెంగీ భూతానికి బలైంది. ఈ కుటుంబంలో మూడు తరాల వారిని డెంగీ జ్వరం కబళించింది. ఈ కుటుంబంలో మిగిలిన మరో ఇద్దరు ఈ జ్వరంబారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిమల్ల రాజగట్టు కొద్ది రోజులుగా డెంగీతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతి చెందాడు. మృతుడి ఐదో రోజు కార్యక్రమాలు నిర్వర్తిస్తుండగానే రాజగట్టు తాత లింగయ్య కూడా డెంగీ జ్వరంతోనే చనిపోయాడు. 
 
ఈ ఇద్దరి మరణాలను తలచుకొని తలుచుకొని బాధపడుతున్న ఆ కుటుంబంలో దీపావళి రోజే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. కుమార్తె ఆరేళ్ల వర్షిని కూడా ఈ జ్వరానికి బలైపోయింది. అలా, తాతను, భర్తను, కూతురును పోగొట్టుకున్న రాజగట్టు భార్య సోనీ ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. మూడు రోజులుగా ఆమె కూడా డెంగీతో బాధపడుతోంది. 
 
ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో కుమార్తె వర్షిని అంత్యక్రియలు ముగించగానే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే తమ కుటుంబంలో డెంగీ బారినపడి మూడు తరాల వాళ్లు చనిపోయారని... ఇప్పడు మరో ఇద్దరు డెంగీతో ప్రాణాల కోసం పోరాడుతున్నారంటూ కన్నీరుమున్నీరయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భీష్మ, మున్సిపాలిటీ కమిషనర్ స్వరూపారాణి పరామర్శించి, ధైర్యం చెప్పారు.