గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (10:45 IST)

ఏపీలో మహిళలకు సంక్రాంతి నుంచి ఉచిత ప్రయాణం... ఆర్టీసీ క్లారిటీ

apsrtc bus
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సంక్రాంతి పండుగ కానుకంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తుండగా, అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. దీంతో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు అమలు చేయబోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు స్పందించారు. 
 
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఏ మేరకు భారం పడుతుంది? అని పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 
 
మరోవైపు, సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుంటే పది శాతం రాయితీ వస్తుందన్నారు. మరో నాలుగు నెలల్లో 1,500 కొత్త లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. 
 
ఈ రోజు (బుధవారం) నుంచి డోర్ డెలివరీ, పికప్ లాజిస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇక నుంచి లాజిస్టిక్ సేవలను ఆర్టీసీ ద్వారానే నిర్వహిస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ వెబ్‌సైట్ ద్వారా తమను సంప్రదిస్తే డోర్ పికప్ చేసుకుంటామన్నారు. ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్టుగా విజయవాడలో ప్రారంభించామని.. త్వరలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.