గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 9 నవంబరు 2021 (11:24 IST)

14 నుంచి ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జన జాగరణ యాత్రలు

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు నేటి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ. ఈనెల 14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జన జాగరణ యాత్రలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. విజయవాడ లోని ఆంధ్ర రత్న భవన్ లో నేటి నుంచి ప్రారంభం అవుతున్నఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ముఖ్య అతిధిగా డాక్టర్ సాకే శైలజనాధ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, ఏఐసీసీ కార్యదర్సులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జెస్ సిడి.మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్, రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులు డా.కెవిపి రామచంద్ర రావు, ఎమ్.ఎమ్.పల్లంరాజు, జెడి శీలం, డా చింతా మోహన్, గిడుగు రుద్రరాజు, కమలమ్మ తదితరులు పాల్గొననున్నారు. 

 
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ, సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ఈనెల 9 నుంచి విజయవాడలో ప్రారంభమవుతుందని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సూచనలు మేరకు సంస్థాగత ఎన్నికల కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే 14 నుంచి జరగనున్న జన జాగరణ యాత్రల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరాచక పాలనకు చరమ గీతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. 

 
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు 14 నుంచి జన జాగరణ యాత్ర విజయవాడలో ప్రారంభవుతుందని, నవంబర్ 18 నుంచి 29 వరకు యాత్రతో పాటు ఆందోళన కార్యక్రమాలను చేపడతామని శైలజానాథ్ తెలిపారు. ఈనెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 50 సంవత్సరాల బంగ్లాదేశ్   విమోచనా దినోత్సవాన్ని జరపనున్నట్లు తెలిపారు. దేశాన్ని, దేశ ప్రజలను, గౌరవాన్ని కాపాడే శక్తి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కే ఉందని స్పష్టం చేసారు.  రాష్ట్రం భ్రష్టు పట్టిపోతోందని, దేశ పరిస్థితులు బాగాలేవని, నిరుద్యోగం పెరిగిందని,  ధరలు పెరిగాయని శైలజనాథ్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన తరువాత పేదలపై అధిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డెక్కితే ప్రజలను లూటీ చేస్తున్నారని, పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిన చమురు ధరలు నియంత్రించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వల్ల  వినియోగదారులపై భారం  పెరుగుతోందని విమర్శించారు. 
 
 
ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అసమర్ధ పాలన..ప్రజలను మోసం చేసే పాలన, అధికార పార్టీ తీరును ఎండ గట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయ చట్టాలు రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయని, రైతుల పోరాటాన్ని గుర్తించకపోగా, రైతుల పట్ల సానుభూతి చూపలేని అరాచక ప్రభుత్వాన్ని చూస్తున్నాం అని ఆవేదన వ్యక్తం చేసారు. ‘ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంలో మోడీ ప్రభుత్వం రికార్డులు నమోదు చేసుకుంటోందని, మోడీ ప్రభుత్వంలోనే అత్యధిక నిరుద్యోగిత నమోదైందని, ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడం కూడా మోడీ ప్రభుత్వ హయాంలోనే అని అన్నారు. వ్యవస్థల విధ్వంసానికి మోడీ ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య మూలసూత్రాలను ప్రశ్నిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వ అణచివేత బాధితులైన రైతులు, రైతు కూలీలు, ఉపాధి కోసం పోరాడే యువత, చిన్న పరిశ్రమల తరఫున పోరాటాన్ని ద్విగుణీకృతం చేయాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు.