1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (20:29 IST)

బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు గెలిచిన కాంగ్రెస్

అక్టోబర్ 30న దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం గమనార్హం.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగించింది. బీజేపీని వెనక్కి నెట్టి ఈ ఉప ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది.
 
మొత్తం 29 అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాల్లో కాంగ్రెస్‌ 8 చోట్ల విజయం సాధించింది. కాగా, బీజేపీ కేవలం 7 స్థానాలనే గెలుచుకుంది. రాజస్తాన్-2, హిమాచల్ ప్రదేశ్-3, మధ్యప్రదేశ్-1, కర్ణాటక-1, మహారాష్ట్ర-1 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో రెండు స్థానాలకు రెండు కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు స్థానాలనూ కాంగ్రెసే గెలవడం గమనార్హం. ఇక బీజేపీ అస్సాంలో అత్యధికంగా 3 స్థానాలు గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లో 2, కర్ణాటకలో ఒకటి, తెలంగాణలో ఒక స్థానంలో గెలుపు దిశగా వెళ్తోంది.
 
2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ చతికిల పడుతూ వస్తోంది. బీజేపీ ముందు నిలవేక గెలవలేక కుప్పకూలిన ఎన్నికలు అనేకం. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాలు మినహా మరెక్కడా కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. మధ్యప్రదేశ్‌లో అయితే ప్రభుత్వాన్ని కూడా కాపాడుకోలేకపోయింది.

ఇక ఏ అసెంబ్లీ ఎన్నికల్లో మరే ఇతర ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభావం చూపలేదు. కాగా, చాలా సందర్భాల్లో అతిపెద్ద పార్టీగా ఉంటూ కాంగ్రెస్‌కు అందనంత దూరంలో ముందుకు వెళ్తోన్న బీజేపీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనక్కి వెళ్లడం గమనార్హం.