1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Fuel price hike shocker for APSRTC

ఏపీఎస్ ఆర్టీసీకి షాకిచ్చిన చమురు కంపెనీలు.. చార్జీల వడ్డన తప్పదా?

Fuel Price
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీకి చమురు కంపెనీలు తేరుకోలేని షాకిచ్చింది. అసలే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉన్న ఆర్టీసీకి ఇపుడు చమురు కంపెనీలు ఇచ్చిన షాక్‌తో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆర్టీసీకి సరఫరా చేసే ఇంధన ధరలను గుట్టుచప్పుడు కాకుండా పెంచేశాయి. 
 
బయట పెట్రోల్ బంకుల్లో ఇచ్చే ధర కంటే ఆర్టీసీకి సరఫరా చేసే ధరలో లీటరుకు రూ.4.30పైసలు వరకు అదనంగా వడ్డిస్తున్నాయి. దీంతో ఆర్టీసీకి రోజుకు పది కోట్ల రూపాయల మేరకు భారం పడుతోందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. 
 
ఏపీ రాష్ట్రంలో ప్రతి రోజూ 10 వేల బస్సులు వివిధ రూట్లలో తిరుగుతున్నాయి. ఈ బస్సులకు నిత్యం 7.30 లక్షల లీటల్ డీజిల్‌‌ ఖర్చు అవుతుంది. ఈ కారణంగా ఆర్టీసీకి  ఇచ్చే చమురు ధరలో రాయితీ ఇస్తూ వస్తున్నాయి. బయట పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధరతో పోల్చితే ఈ ధర రూ.2 వరకు తక్కువగా ఉంటుంది. 
 
అయితే, గత పది రోజులుగా లీటరుకు రూ.4.30 పైసలు చొప్పున అదనంగా వడ్డిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో చమురు కంపెనీలు ఆర్టీసీ వంటి సంస్థలకు సరఫరా చేసే ఇంధన ధరలను పెంచేసింది. చమురు కంపెనీలు ఇచ్చిన షాక్‌తో ప్రజలపై భారం మోపే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. అంటే బస్సు చార్జీలను పెంచే దిశగా ఆలోచన చేస్తుంది. 
తర్వాతి కథనం
బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై కేసు నమోదు