బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 3 జనవరి 2022 (10:33 IST)

ఎవ‌రైనా బట్టల‌న్నీ విప్పేసి ఆత్మహత్య చేసుకుంటారా?

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గెడ్డం శ్రీను మృతి కేసు మిస్ట‌రీ ఇంకా వీడ‌లేదు. గత ఏడాది అక్టోబర్ 6న అనుమానాస్సద స్థితిలో శ్రీను మృతి చెందాడు. తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, హత్యేనని శ్రీను తల్లిదండ్రులు వాదిస్తున్నారు.
 
 
"పోలీసుల తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది. ఆత్మహత్య చేసుకున్నాడ‌ని చెబుతున్నారు. కానీ ఎవరైనా బట్టలు పూర్తిగా తీసేసి ఆత్మహత్యకు పాల్పడతారా? ఆత్మహత్య కోసం పురుగుల మందు తాగితే వాంతులు చేసుకోవాలి కదా. అలాంటి ఆనవాళ్లు ఎందుకు లేవు? శరీరంపై గాయాలు ఎలా వచ్చాయి? వీటన్నింటికీ సమాధానాలు చెప్పాలి కదా. కానీ కేసు మాత్రం తాత్సార్యం చేస్తున్నారు. అందుకే హైకోర్టును ఆశ్రయించాం. నెల రోజుల్లోగా అనుమానితులను అరెస్ట్ చేసి , నివేదించాలని కోర్టు తెలిపింది" అంటూ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వివరించారు.
 
 
పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని ఓ చిన్న గ్రామం మలకపల్లిలో అరుంధతి పేటలో గెడ్డం బుల్లయ్య, వెంకాయమ్మ నివాసముంటున్నారు. వారు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి ఏకైక కుమారుడు గెడ్డం శ్రీను గత అక్టోబర్ 6న అనుమానాస్సద స్థితిలో మరణించాడు. వేరొక రైతు పొలంలో నెల జీతానికి పాలేరుగా పని చేస్తున్న శ్రీను ఆ పొలంలోనే నగ్నంగా పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.
 
 
పోస్టుమార్టమ్ నివేదిక ఆధారంగా పోలీసులు ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు. శ్రీను తల్లిదండ్రులు మాత్రం అది హత్యేనని వాదిస్తున్నారు. తమ కుమారుడిని చంపినవారిని అరెస్ట్ చేసి, తమను ఆదుకోవాలంటూ మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. గెడ్డం శ్రీను మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు తాళ్లపూడి సబ్ ఇన్ స్పెక్టర్ కట్టా వెంకట రమణ తెలిపారు. తమ కొడుకుని యజమానులే చంపేశారని, ఏం జరిగిందో తెలియకుండానే తమ కొడుకును తమకు దూరం చేశారని గెడ్డం శ్రీను తండ్రి బుల్లయ్య ఆరోపిస్తున్నారు.
 
 
"మా కొడుకు ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్నాడు. ఎప్పుడూ వివాదాల్లో లేడు. చదువు ఆపేసి కొన్నాళ్లుగా కూలీ పనులు చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం కొమ్మిరాజు ముత్యాలరావు వద్ద పాలేరుతనానికి చేరాడు. ఏడాదికి రూ. 1,50,000 జీతం ఇస్తామని చెప్పారు. అడ్వాన్సుగా రూ. 30,000, ఆ తర్వాత రూ.10,000 ఇచ్చారు. ఉదయాన్నే రైతు ఇంటికి వెళ్లి గేదె పాలు తీయడం, అంతా శుభ్రం చేసి పొలానికి వెళ్లి పనిచేయడం, మళ్లీ సాయంత్రం గేదె పాలు పితకడం వంటి పనులు చేసేవాడు. కానీ ఏం జరిగిందో తెలియకుండానే మా బిడ్డను చంపేశారు. అరటితోటలో వాడి మృతదేహం మీద ఆనవాళ్లు తొలగించేశారు. పోలీసులు రాకముందే అంతా కడిగేశారు. పంచనామా కూడా చేయకుండా పోస్ట్ మార్టమ్ కోసం తరలించేశారు" అంటూ ఆయన చెప్పుకొచ్చారు. గెడ్డం శ్రీను హత్యపై పూర్తి విచారణ చేసి, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బుల్లయ్య, వెంకాయమ్మ దీక్ష చేస్తున్నారు.
 
 
గెడ్డం శ్రీనుది హత్యేనని, కానీ దానిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని హర్షకుమార్  అన్నారు. మూడు నెలల కిందటే కేసులో అనుమానితుల గురించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నది అర్థం కావడం లేదన్నారు. త‌మ బిడ్డను చంపేసి, కేసు లేకుండా చేస్తున్నారని గెడ్డం శ్రీను తల్లి వెంకాయమ్మ చెబుతున్నారు. గెడ్డం శ్రీను కాల్ డేటా బయటపెట్టాలని కోరారు. తమకు ఆధారంగా నిలవాల్సిన కన్న కొడుకుని కోల్పోయిన తర్వాత తమకు దిక్కెవరని ఆమె ప్రశ్నిస్తున్నారు. అందుకే, ఎంతకాలమైనా దీక్షలు కొనసాగిస్తున్నామని  అన్నారు.