1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (16:02 IST)

అమెరికా నుంచి వచ్చాడు.. సాఫ్ట్‌గా ఉంటాడనుకుంటే పొరబడినట్టే : యార్లగడ్డ వెంకట్రావ్

yarlagadda venkat rao
అమెరికా నుంచి వచ్చాడు.. సాఫ్ట్‌గా ఉంటాడు, వివాద రహితుడుగా ఉంటాడని అనుకుంటారేమో... జిల్లా ఎస్పీ పేరును తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాస్తున్న రెడ్ బుక్‌లో చేర్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటా అంటూ తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ హెచ్చరించారు. ఇదే అంశంపై మాట్లాడుతూ, గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి రివర్స్ కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ పోలీసులను విమర్శించారు. ఊరి చెరువు మట్టి కొంతమంది జేబులోకి వెళుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
 
రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా అంగబలం, అర్థబలమే అవసరమైతే తన వద్ద రెండూ ఉన్నాయన్నారు. గొడవలే పరిష్కారం కాదని, గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడులను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ ఆఫీసులపై దాడి, ఆస్తులు లాక్కొనే దుర్మార్గపు పరిస్థితులు గన్నవరంలోనే ఉన్నాయని, ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు కడపలో కూడా లేవని ఆయన ఆగ్రహం వ్యాఖ్యానించారు. నాయకులను గెలిపించుకునేది పార్టీ కార్యాలయాలపై దాడుల కోసం కాదన్నారు. ఆరు సార్లు టీడీపీ గెలిచిన గన్నవరం నియోజకవర్గంలో తాను గెలవడం చాలా సులువు అని యార్లగడ్డ వెంకట్రావ్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీకి మద్దతు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
 
నారా కుటుంబ సభ్యులపై నోరు పారేసుకోవడానికి ఇకనైనా అంతం లేదా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. బూతులు మాట్లాడటమే రాజకీయం అయితే రెండు రోజుల్లో నేర్చుకొని తాను కూడా మాట్లాడగలనని ఆయన ప్రకటించారు. రోడ్లు, ఉపాధి లేక రాష్ట్రంలో చాలా మంది వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని యార్లగడ్డ వెంకట్రావ్ ఆరోపించారు. రాష్ట్రంలో పరిశ్రమలు లేవని, ఈ దుస్థితి పోవాలంటే చంద్రబాబు రాష్ట్రానికి సీఎం కావాలని అభిలాషించారు.