గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (08:39 IST)

కల్వకుంట్ల కుటుంబాన్ని బొందపెడతాం : కాంగ్రెస్ నేత మైనంపల్లి వార్నింగ్

Mynampally Hanumanth Rao
తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, కల్వకుంట్ల కుటుంబాన్ని బొందపెడతామని కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని బొంద పెట్టేంతవరకు నిద్రపోనంటూ కార్యకర్తల సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలచకుంటే కేసీఆర్ ఆయన పరివారం అంతా జైల్లో ఊచలు లెక్కించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సిద్ధిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం పూజా కార్యక్రమం మంగళవారం జరిగింది. ఇందులో పాల్గొన్న మైనంపల్లి మాట్లాడుతూ, కేటీఆర్ పెద్ద వెధవ అని, తన ముందు బచ్చాగాడన్నారు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు తప్ప ఏమీ రాదని ఎద్దేవా చేశారు. ఆ నాడు కేకే మహేందర్ రెడ్డి వల్లే కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ ఎంపీగా గెలిచారని గుర్తుచేశారు. 
 
గత పదేళ్ల అధికారంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని, హైదరాబాద్ నగరాన్ని కబ్జా చేశాడని మండిపడ్డారు. ఉద్యమం, అధికారం పేరిట 23 ఏళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన కేసీఆర్ ఎన్నికల్లో ఒడిపోగానే కిందపడినట్టు కథ అల్లిండని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు దుస్తులు ఊడదీసి కొడతారని, సొంత కులస్తులే చెప్పులతో దాడి చేస్తారని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రేవంత్‌ను ఎన్నో కష్టాలు పెట్టారని గుర్తు చేశారు. మెదక్‌, సిద్దిపేటలో కాంగ్రెస్‌ కార్యకర్తల జోలికొస్తే తానే స్వయంగా హరీశ్‌రావు ఇంటిమీద దాడి చేస్తానని మైనంపల్లి హెచ్చరించారు. హరీశ్‌రావు కూడా బీఆర్‌ఎస్‌లో ఉండరని, బీజేపీలో చేరతారని ఆరోపించారు. మైనంపల్లి అంటేనే ఒక పవర్‌ అని స్పష్టం చేశారు.