బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (09:23 IST)

తెలంగాణ ఎన్నికలు : చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ ఇంట్లో ఐటీ రైడ్స్

Vivek Venkataswamy
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ ఎన్నికల్లో పలువురు బీజేపీ నేతలు తమ పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇలాంటి వారితో పాటు.. బడా కాంగ్రెస్ నేతల గృహాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో పొంగులేని శ్రీనివాస్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు మంగళవారం చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ జి. వివేక్ వెంకటస్వామి నివాసంతో పాటు ఆయన అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. 
 
వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితిలు ఐటీ సోదాలు జరిపిస్తున్నాయంటూ మండిపడ్డారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఐటీ సోదాలు జరగడం గమనార్హం. 
 
ఒక్క తెలంగాణాలోనే రూ.659 కోట్లు.. మిగిలిన రాష్ట్రాల్లో ఎంతంటే... 
 
వచ్చే యేడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసింది. అయితే, ఈ ఎన్నికల్లో ఓటర్లు ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు నగదును ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నారు. ఓటరుకు డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు చేసి గెలుపొందాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఫలితంగా ఈ ఐదు రాష్ట్ర ఎన్నికల్లో ధనం ఏరులై పారింది. 
 
భారత ఎన్నికల సంఘం ఈ నెల 20వ తేదీ నాటికి ఈ ఐదు రాష్ట్రాల్లో ఏకంగా రూ.1,760 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొంది. ఇందులో రూ.659.2 కోట్ల సొత్తును ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత స్థానంలో రూ.650.7 కోట్లతో రాజస్థాన్ ఉంది. మొత్తం అయిదు రాష్ట్రాల్లో కలిపి రూ.372.9 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా అందులో 60 శాతం తెలంగాణలోనే లభించింది. మద్యం, డ్రగ్స్, విలువైన లోహాల స్వాధీనంలోనూ తెలంగాణే తొలిస్థానాన్ని ఆక్రమించింది. 
 
ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో 2018 ఎన్నికల సమయంలో దొరికిన రూ.239.15 కోట్లతో పోలిస్తే ఈసారి ఇప్పటివరకు దొరికిన సొత్తు విలువ 636 శాతం అధికంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల కంటే ముందు జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక ఎన్నికల్లో రూ.1,400 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నామని.. అది ఆయా రాష్ట్రాల్లో అంతకు ముందు ఐదేళ్ల కిందట స్వాధీనం చేసుకున్న మొత్తంతో పోలిస్తే 1009.12 శాతం అధికమని ఈసీ వెల్లడించింది.