శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2023 (13:58 IST)

తండ్రి బాబూ మోహన్‌కు షాకిచ్చిన తనయుడు ఉదయ్.. బీఆర్ఎస్‌లో చేరిక

babu mohan son
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమతమ పార్టీల తరపున పోటీ చేసేందుకు టిక్కెట్ ఆశించి భగంపడిన నేతలు.. తమ పార్టీలకు తేరుకోలేని షాకిస్తున్నారు. తాజాగా ఆంధోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి, హాస్య నటుడు బాబూ మోహన్‌కు ఆయన కుమారుడు ఉదయ్ బాబూ మోహన్ షాకిచ్చారు. 
 
ఆదివారం ఉదయం మంత్రి హరీష్ రావు సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఉదయ్ ఆంధోల్ టిక్కెట్ ఆశించారు. బాబూ మోహన్ కూడా కుమారుడికే టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని కోరారు. కానీ, కమలనాథులు మాత్రం బాబూ మోహన్‌కు టిక్కెట్ ఇచ్చి, ఉదయ్‌కు షాకిచ్చింది. దీంతో ఆయన బీజేపీకి రాజీనామా చేసి తిరిగి భారాసలో చేరారు. పార్టీ తీరుపై తీవ్ర ఆసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. 
 
కాగా, 2014లో బీఆర్ఎస్‌లో చేరిన బాబూ మోహన్ ఆ ఎన్నికల్లో ఆంధోల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2018లో ఆయనకు సీఎం కేసీఆర్ టిక్కెట్ నిరాకరించడంతో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇపుడు మరోమారు ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఆయన తనయుడు ఉదయ్ బాబూ మోహన్ తేరుకోలేని షాకిచ్చారు.