సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2023 (16:51 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : 110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు : రేవంత్ రెడ్డి జోస్యం

revanth reddy
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏకంగా 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యమని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని తెలిపారు. 
 
గత ఎన్నికల్లో భాజపాకు 105 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవ్వగా.. ఈసారి 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. డిపాజిట్లు రాని పార్టీ.. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుందని ఎద్దేవా చేశారు. భాజపా 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే.. ఒకరు మాత్రమే ఓబీసీ సీఎంగా ఉన్నారని తెలిపారు. 
 
'బీసీ గణన చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తున్నా భాజపా పట్టించుకోలేదు. అలాంటి పార్టీ బీసీ సీఎంను ఎలా చేస్తుంది? ఎన్నికల కోసమే భాజపా ఎస్సీ వర్గీకరణ హామీ ఇస్తుంది. భాజపా చెప్పే మాటలు దళితులు ఎవరూ నమ్మరు. ఎన్నికలు అయ్యాక ఎస్సీ వర్గీకరణ హామీని భాజపా పట్టించుకోదు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడిగే స్థితిలో కేసీఆర్‌ లేరు. రాష్ట్రంలో రైతులకు కేవలం 8 నుంచి 10 గంటలు మాత్రమే కరెంట్‌ ఇస్తున్నారు. ధరణి వల్ల భూదోపిడీ జరిగింది. ధరణి ద్వారా లక్షన్నర ఎకరాలను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంది. దీనిపై కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారు.
 
అదేసమయంలో అర్హత కలిగిన వారికి అవకాశం కల్పించడమే కాంగ్రెస్‌ విధానం. రైతు రుణమాఫీ చేయాలని కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు. మేం అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. అధికారం కోల్పోతున్నామని కేసీఆర్‌ విచక్షణారహితంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో భారాసను భయపెడుతోంది. అధికారంలోకి రాగానే 2 లక్షలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యూపీఎస్సీ తరహాలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం. భారాస ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోలేదు అని రేవంత్‌ ఆరోపించారు. 
 
అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్దామని, ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుదామన్నారు. కేంద్రం అనుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్స్ ఇవ్వవచ్చునని చెప్పారు. అబద్ధపు హామీలను నమ్మకుండా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కార్యాచరణను ప్రకటిస్తే మద్దతిచ్చేందుకు తాము సిద్ధమన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ... బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదన్నారు. దళితుల ఓట్లు కాంగ్రెస్‌కు రాకుండా చీల్చేందుకే ప్రధాని నరేంద్ర మోడీ కమిటీ అన్నారని, ఆ పేరుతో కాలయాపన చేస్తారన్నారు.