సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తెదేపాకు 'గంట' కొట్టేశారు... త్వరలో కాషాయ తీర్థం?

తెలుగుదేశం పార్టీకి మరో సీనియర్ నేత గుడ్‌బై చెప్పనున్నారు. ఆయన పేరు గంటా శ్రీనివాస రావు. పార్టీల మారడంలో తనకు మించినవారు మరొకరు లేరని మరోమారు ఆయన నిరూపించుకోనున్నారు. ఇప్పటికే, పలు మార్టీలు మారిన గంటా శ్రీనివాస రావు... త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. వీటిని రుజువు చేసేలా గంటా శ్రీనివాస రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
 
గురువారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలిసి కీలక మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎంతమంది బీజేపీలో చేరతారన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ వారు బీజేపీతో చేతులు కలిపితే అనర్హత వేటు పడటం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న గంటా సుజనా, సీఎం రమేశ్‌తో కూడా చర్చలు జరిపిన విషయం తెల్సిందే.