శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 16 అక్టోబరు 2021 (13:56 IST)

జిజి హెచ్ వార్డు బాయ్, మ‌రో మ‌హిళ శిశువును ఎత్తుకెళ్ళారు!

గుంటూరు జీజీహెచ్ లో మూడు రోజుల‌ మగ శిశువు అపహరణ కేసు కొద్ది గంట‌ల్లోనే కొలిక్కి వ‌చ్చింది. గుంటూరు పోలీసులు చాలా చురుకుగా విచార‌ణ జ‌ర‌ప‌గా, త‌ప్పిపోయిన శిశువు ఆచూకి అభ్యం అయింది. ఈ దుర్మార్గానికి పాల్ప‌డింది జీజీహెచ్ లోని వార్డు బాయ్ హేమ వ‌రుణుడు అని పోలీసులు తేల్చారు. మ‌రో మ‌హిళ‌తో క‌లిసి వార్డు బాయ్ ఈ దురాగ‌తానికి పాల్ప‌డ్డాడ‌ని స‌మాచారం. వీరిద్ద‌రూ క‌లిసి శిశువును  గుంటూరు నెహ్రూ న‌గ‌ర్ స‌మీపంలో దాచిపెట్టిన‌ట్లు తెలిసింది. అయితే, పోలీసులు నిందితుల‌ను అనుమానించి అదుపులోకి తీసుకుని త‌మ‌దైన శైలిలో ప్ర‌శ్నించ‌గా, అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు. శిశువు మోతీలాల్ న‌గ‌ర్ ఒక‌టో లైన్ లో ఉన్న‌ట్లు తెల‌ప‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 
గుంటూరు జీజీహెచ్ లో మూడు రోజుల‌ మగ శిశువు అపహరణ కలకలం రేపింది. పెదకాకానికి చెందిన ప్రియాంక మూడు రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. రాత్రి చిన్నారి ఏడుస్తుండడంతో బయటకు తీసుకొచ్చిన నాయనమ్మ...తర్వాత శిశువు అప‌హ‌ర‌ణ అయిన‌ట్లు తెలిపింది. బాత్రూంకు వెళుతూ, నిద్రపోతున్న అమ్మమ్మ పార్వతమ్మ పక్కన శిశువును పెట్టినట్లు నాయనమ్మ తెలిపింది. ఆ త‌ర్వాత ఐదు నిమిషాల్లోనే శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు బంధువులు చెప్పారు. కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు త‌మ‌కు ఆసుప‌త్రిలోని ఇద్దరు వ్య‌క్తులపై అనుమానం ఉన్న‌ట్లు చెపుతున్నారు. వీరి ఫిర్యాదు ఆధారంగా కొత్తపేట పోలీసులు సీసీ ఫుటేజ్ లను పరిశీలించి, వార్డు బాయ్ నిందితుడ‌ని తేల్చారు.