శ్రీశైలంలో బయటపడిన బంగారు నాణాలు
శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానం ఘంటామఠం పునర్ నిర్మాణ పనుల్లో మరోసారి నాణేలు బయటపడ్డాయి. ఆదివారం నిర్మాణ పనులు చేస్తుండగా ఒక పెట్టెలో 15 బంగారు నాణేలు, 1 బంగారు ఉంగరం, 17 వెండి నాణేలు వెలుగుచూశాయి.
సమాచారం అందుకున్న ఆలయ ఈవో కె.ఎస్. రామారావు, తహసీల్దార్ రాజేంద్రసింగ్, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకున్నారు. అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.
ఘంటామఠం దక్షిణ భాగంలో ఉన్న గుండంలో ఊట వచ్చే ప్రదేశంలో ఇవి బయట పడ్డాయి. బంగారు నాణేలు 1880-1911 కాలానికి సంబంధిచినవని, వెండి నాణేలు 1885-1913 కాలానికి చెందినవని ఆలయ అధికారులు గుర్తించారు.
వీటితోపాటు 1892 నాటి మరో వెండి నాణెం కూడా లభించింది. విషయం తెలుసుకున్న దేవస్థానం ఈవో కేఎస్ రామరావు అధికారులతో కలిసి ఘంటామఠానికి చేరుకుని పురాతన నాణేలను పరిశీలించారు. అధికారుల సమక్షంలో వీటి వివరాలు నమోదు చేశారు.