బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (14:12 IST)

గ్రామ సచివాలయం సిబ్బందికి గుడ్ న్యూస్.. ఏంటది?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్న సిబ్బందికి సర్వీసు రూల్స్‌ రూపొందించి, వారికి ఉద్యోగపరమైన ప్రయోజనాలు అందజేయాల్సిన అవసరం ఉందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ అన్నారు. విజయవాడ ఆటోనగర్‌లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల కమిషనరేట్‌లో గురువారం సమావేశం జరిగింది.
 
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి సర్వీసు రూల్స్, సెలవుల నియమావళి, ప్రొబేషన్, ఉద్యోగుల ఆరోగ్య పథకం, కారుణ్య నియామకాలు, సర్వీసు బుక్ నిర్వహణ, శిక్షణ, శిక్షణ సంబంధిత పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు, డ్రెస్‌ కోడ్‌ వంటి అంశాలపై చర్చించారు. మార్చి 30లోపు ఆయా శాఖలు సర్వీసు పుస్తకాలు ప్రారంభించాలన్నారు. సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్‌ డా.నారాయణ భరత్‌గుప్తా కూడా పాల్గొన్నారు.
 
మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రిని ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ కోరింది. 2015 పీఆర్సీ ప్రకారం జూనియర్‌ అసిస్టెంట్‌ పే స్కేల్‌ అమలు చేయాలని గురువారం లేఖ రాశారు. సర్వీస్‌ రిజిస్టర్‌ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. నెలకు ఐదు రోజులు మండల కార్యాలయానికి వెళ్తున్నామని.. ఎఫ్‌టీఏ, టీఏ సౌకర్యం కల్పించాలన్నారు. 
 
మహిళా ఉద్యోగుల బదిలీలపై ఉన్న బ్యాన్‌ ఎత్తివేసి, వారిని నివాస ప్రాంతానికి దగ్గరగా బదిలీ చేయాలని కోరారు. శానిటేషన్‌ విభాగం వారికి వారాంతపు సెలవు కల్పించాలన్నారు. కొంతమంది ఉద్యోగులు రోడ్డు ప్రమాదంలో మరణించారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.