ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించండి : ఏపీ సర్కారుకు గవర్నర్ ఆదేశం

nimmagadda ramesh
ఠాగూర్| Last Updated: బుధవారం, 22 జులై 2020 (14:00 IST)
నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన న్యాయపోరాటంలో విజయం సాధించారు. ఎట్టకేలకు ఆయన్ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నియమించాలంటూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులుకానున్నారు.

కాగా, ఎస్ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డను తొలగించేందుకు ఏపీ సర్కారు కుట్ర పూరితంగా ఆలోచన చేసి.. ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇందులో ఎస్ఈసీ పదవీకాలాన్ని మూడేళ్ళకు కుదించింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ అధికారి అయిపోయారు. ఆయన స్థానంలో కొత్తగా తమిళనాడు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి కనకరాజ్‌ను ఎస్ఈసీగా నియమించగా, ఆయన కూడా ఆగమేఘాలపై పదవీ బాధ్యతలు చేపట్టారు.

అయితే, రమేష్ కుమార్ న్యాయపోరాటం చేశారు. ఇందులో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో విజయం సాధించారు. ఏపీ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో హైకోర్టు సూచన మేరకు ఇప్పటికే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశమై వినతి పత్రం కూడా సమర్పించారు.

ఈ నేపథ్యంలో బుధవారం గవర్నర్ బిశ్వభూషణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను నియమించాలని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ పంపారు.దీనిపై మరింత చదవండి :