సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (11:26 IST)

హల్లో నరసింహన్‌జీ... ప్యాకేజీతో ఏపీ ప్రజలు హ్యాపీయేనా.. ఇంకేం కోరుతున్నారు.. మోడీ ఆరా

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై గవర్నర్ నరసింహన్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. 'ఏపీకి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ ఎలా ఉంది?... ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సంతోషంగా ఉన్నారా?

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై గవర్నర్ నరసింహన్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. 'ఏపీకి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ ఎలా ఉంది?... ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సంతోషంగా ఉన్నారా?... ఇంకా వారు కోరుకుంటున్నదేమిటి?.. ఏం చేస్తే బాగుంటుంది?' అని నరసింహన్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 
 
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన నరసింహన్‌ మంగళవారం మధ్యాహ్నం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం జరగ్గా... దాదాపు 20 నిమిషాలకుపైగా ఏపీ ప్యాకేజీపైనే ప్రధాని, గవర్నర్‌ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు కూడా వారి చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. 
 
ప్రత్యేకహోదా ఇవ్వడానికి ఉన్న అడ్డంకులను అన్ని పార్టీలకు వివరించి ఆ తర్వాత ప్యాకేజీపై ప్రకటన చేసి ఉంటే బాగుండేదని గవర్నర్‌ సూచించగా... ప్యాకేజీపై అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తే సమస్య మరింత జఠిలమవుతుందని మోడీ అభిప్రాయపడినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
 
అభివృద్ధి కావాలనుకున్న వాళ్లు ప్యాకేజీని స్వాగతిస్తారని, సమస్యలను సాగదీసి రావణకాష్టం చేయాలనుకున్న వారు మాత్రమే విమర్శలు చేస్తారని ప్రతిపక్షాలపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీకి ప్యాకేజీని ప్రకటించడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందని, ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి సమస్యలూ ఎదురుకావనే భావిస్తున్నామని, ప్యాకేజీ వల్ల అభివృద్ధి పథంలో ఏపీ దూసుకుపోవడం ఖాయమని ప్రధాని అభిప్రాయపడ్డారు.